Begin typing your search above and press return to search.

ఏపీకి హైదరాబాద్ ఆస్తిపన్ను పోటు

By:  Tupaki Desk   |   11 Dec 2015 4:37 AM GMT
ఏపీకి హైదరాబాద్ ఆస్తిపన్ను పోటు
X
పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి ఎందుకంత హడావుడిగా ఏపీకి వెళుతున్నారు. తీరుబడిగా ఏపీకి వెళ్లొచ్చుగా అంటూ కొందరు లా పాయింట్లు తీస్తారు. పేరుకు ఉమ్మడి రాజధాని మాత్రమే కానీ.. అధికారాలు..ఆదాయాలు ఏమీ ఉండవన్న విషయాన్ని ఇలా లా పాయింట్లు తీసేవారు పట్టించుకోరు. ఉమ్మడి రాజదాని పేరిట ఏపీ సర్కారు హైదరాబాద్ లో ఉండటం అంటే ఇంచుమించు లాడ్జిలో ఉన్నట్లే. ఏదైనా విహారయాత్రకు వెళ్లినప్పుడు లాడ్జిలో బస చేస్తాం. లాడ్జిలో ఉన్నంత సేపు నచ్చినట్లు చేసుకోవచ్చు.కానీ.. అదంతా కూడా లాడ్జి వాడి రూల్స్ కు తగ్గట్లే. అది కూడా.. లాడ్జి వాడికి రోజూ కట్టాల్సిన అద్దెలు కడితేనే.

హైదరాబాద్ లో ఏపీ సర్కారు సంగతి కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. లాడ్జి వాడికి అద్దె కడితే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండే ఏపీ సర్కారు.. తాము వాడుకునే భవనాలకు ప్రతి ఏటా ఆస్తిపన్ను కట్టాల్సిందే. ఇలా పన్ను కట్టటం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదే. కాకుంటే.. ఈ జేబులో నుంచి తీసి ఆ జేబులో వేసుకోవటం మాదిరి ఉండేది. కానీ.. విభజన జరిగిన తర్వాత కట్టే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు కట్టే ఆస్తిపన్ను మొత్తం తెలంగాణ సర్కారుకే చెందుతుందే తప్పించి.. ఏపీ సర్కారు నయాపైసా రాదు.

అలాంటప్పుడు హైదరాబాద్ లో ఉండి.. పరిమిత స్వేచ్ఛతో.. ప్రతిఏటా ఆస్తిపన్నుతో పాటు.. మిగిలిన పన్నుల్ని కట్టేబదులు సొంత రాష్ట్రంలో ఉంటే మంచిది కదా. ఇవాళ కాకున్నా.. పదేళ్ల తర్వాత అయినా ఏపీకి వెళ్లాల్సిందేగా. అదే ఇప్పుడే వెళితే.. ఆస్తిపన్ను లాంటి చిల్లర ఖర్చులైనా మిగులుతాయి. విభజన తర్వాత నుంచి ఏపీ సర్కారు గ్రేటర్ కు తాను వాడుకుంటున్న భవనాల కోసం కట్టాల్సిన ఆస్తిపన్ను రూ.63 కోట్లుగా తేల్చింది. దీనికి సంబంధించి తాజాగా ఆస్తిపన్ను నోటీసులు జారీ చేశారు. విభజన నాటి నుంచి కట్టాల్సిన మొత్తంగా చెబుతున్నారు. హైదరాబాద్ లో వినియోగించుకుంటున్న ప్రభుత్వ భవనాలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను ప్రతి ఏటా సుమారు రూ.21కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. గతంలో చెల్లించాల్సిన బకాయిలతోకలిపి.. ఏపీ సర్కారు తాజాగా రూ.63కోట్లు చెల్లించాల్సిందిగా లెక్కలు తేల్చారు. హైదరాబాద్ లో ఏపీ సర్కారు ఉంటే ఎంత ఖర్చో అర్థమైందా?