Begin typing your search above and press return to search.

మ‌రీ.. ఇంత 'సోష‌ల్' ఉలికిపాటు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   17 May 2017 5:30 PM GMT
మ‌రీ.. ఇంత సోష‌ల్ ఉలికిపాటు అవ‌స‌ర‌మా?
X
పొగ‌డ్త ఎంత తియ్య‌గా ఉంటుందో.. విమ‌ర్శ అంత చేదుగా ఉంటుంది. ఇక‌.. వ్యంగ్య విమ‌ర్శ సంగ‌తి అస్స‌లు చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. క‌త్తి మొన‌తో గుచ్చిన‌ట్లుగా ఉంటుంది. గ‌తంలో వ్యంగ‌స్త్రాలు మీడియాలో క‌నిపించేవి. అవి కూడా ప‌రిమితంగా ఉండేవి. కానీ.. సోష‌ల్ మీడియా రంగ‌ప్ర‌వేశంతో సీన్ మొత్తం మారిపోయింది. ఎవ‌రికి వారు.. త‌మ మ‌న‌సులోని భావాల‌కు త‌గ్గ‌ట్లు పోస్టులు త‌యారు చేసేయ‌ట‌మే కాదు.. వాటిని స్వేచ్ఛ‌గా పంచుకోవ‌టానికి సోష‌ల్ మీడియా ఒక సాధ‌నంగా మారింది.

త‌మ భావాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న పోస్టుల్ని లైక్ చేస్తూ.. షేర్ చేయ‌టం ఎక్కువ‌య్యాక‌.. కొన్ని పోస్టులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఫేస్ బుక్.. ట్విట్ట‌ర్ కంటే ఎప్పుడైతే వాట్స‌ప్ రంగ‌ప్ర‌వేశం చేసిందో అప్ప‌టి నుంచి సీన్ మొత్తం మారిపోయింది. త‌మ‌కొచ్చిన పోస్టుల్ని అనుక్ష‌ణం చెక్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని తిరిగి షేర్ చేయ‌టం ఇప్పుడో దిన‌చ‌ర్య‌గా మారిపోయింది.

దీంతో.. ఆస‌క్తిక‌ర‌మైన ఏ పోస్ట్ అయినా వాయువేగంతో వైర‌ల్ గా మారిపోయి.. కోట్లాది మంది మీద ప్ర‌భావితం చేస్తోంది. ఇలాంటివి రాజకీయ పోస్టులు అయితే.. వాటి వ‌ల్ల క‌లిగే లాభ‌న‌ష్టాలు ఎంత‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అయితే.. ఎక్క‌డా లేని రీతిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టుల మీద ఆ రాష్ట్ర అధికార‌ప‌క్షం తీవ్రంగా రియాక్ట్ అవుతుంద‌న్న విమ‌ర్శ‌లు జోరు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

మొన్న‌టికి మొన్న పొలిటిక‌ల్ పంచ్ నిర్వాహ‌కుడు ఇంటూరి ర‌వికిర‌ణ్‌.. తాజాగా ఇప్పాల రవీంద్ర‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూస్తే.. రేపు ఇంకెవ‌ర‌న్న ప్ర‌శ్న చ‌టుక్కున రావ‌టం ఖాయం. ఇంత‌కీ వీరి మీద మోపుతున్న అభియోగాలు ఏమిటంటే.. అధికార పార్టీ మీద అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ.. వారి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నార‌న్న‌ది.

ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం ఏమిట‌న్న‌ది చూస్తే.. ముందుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యే పోస్టింగుల‌ను చూడాలి. మిగిలిన ఫ్లాట్ ఫాంల‌తో పోలిస్తే.. సోష‌ల్ మీడియాలో స్వేచ్ఛ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. త‌మ మ‌న‌సులోని భావాల్ని మోతాదు మించిన మ‌సాలాతో ద‌ట్టించి పోస్టులు పెడుతుంటారు. పొగిడే విష‌యంలోనూ.. విమ‌ర్శించే విష‌యంలోనూ ఇది చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే.. చిక్కంతా ఎక్క‌డ వ‌స్తుందంటే.. త‌మను డ్యామేజ్ చేసే వారి విష‌యంలో ఏపీ అధికార‌ప‌క్షం అవ‌స‌రానికి మించిన ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టంతోనే.

త‌మ‌ను డ్యామేజ్ చేస్తున్న వారి మీద‌న కేసులు క‌త్తి క‌డుతున్న ఏపీ స‌ర్కారు.. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పైనా విరుచుకుప‌డే వారి మీదా అదే స్థాయిలో వ్య‌వ‌హ‌రిస్తే విష‌యం మ‌రోలా ఉండేది. సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు ఎవ‌రు పెట్టినా స‌హించేది లేద‌ని.. సోష‌ల్‌ ప్ర‌వ‌ర్త‌న మీద ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్ గా ఉందన్న మాట ఉండేది. ఈ తీరును అంద‌రూ స‌మ‌ర్థించే వారేమో. పార్టీల‌కు అతీతంగా హ‌ద్దులు దాటిన వారు ఎవ‌రి మీద‌నైనా స‌రే చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న మాట అధికార‌ప‌క్షానికి ప్ల‌స్ గా ఉండేది.

అయితే.. త‌మ మీద విమ‌ర్శ‌లు చేసేవారి మీద‌ తీవ్రంగా రియాక్ట్ అవుతున్న ఏపీ స‌ర్కారు.. త‌మ ప్ర‌త్య‌ర్థుల మీద విరుచుకుప‌డే వాటిని అస్స‌లు ప‌ట్టించుకోకుండా ఉండ‌టంపై పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌న్ను ఏమైనా అంటే బాగోద‌ని చెప్పేట‌ప్పుడు.. అదే మాట త‌న‌కు కూడా వ‌ర్తిస్తుంద‌న్న విష‌యాన్ని ఏపీ అధికార‌ప‌క్షం ఆలోచించ‌టం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. త‌మ మీద వ్యంగ్య వ్యాఖ్య‌లు.. చిత్రాలు వేసే వారి మీద కేసుల క‌త్తి కడుతూ విరుచుకుప‌డుతున్నార‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంది. నిజానికి ఆన్ లైన్లో చాలా మామూలుగా ఉండే ఇలాంటి విష‌యాల మీద ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారుతోంది. ఒక‌వేళ‌.. రియాక్ట్ కావ‌టం త‌ప్పు లేద‌నుకుంటే.. అది వ‌న్ సైడ్ గా ఉండ‌టం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌మ‌ను త‌ప్పు ప‌డుతూ.. పోస్టులు పెట్టే వాటిలో అనుచితంగా ఉన్న వాటిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అధికార‌ప‌క్షం త‌న వాద‌న‌ను వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో అధికార‌ప‌క్షం తీరును విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండిస్తున్నారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్నారంటూ మండిప‌డుతున్నారు.

అధికార‌పార్టీపై వ్యంగ్య చిత్రాల్ని.. వ్యాఖ్య‌ల్ని పోస్ట్ చేసిన వారిపై పెట్టిన కేసుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్ని తాము టేక‌ప్ చేస్తామ‌ని చెబుతున్నారు. ఇంటూరు ర‌వికిర‌ణ్ పై ఉన్న కేసుల్ని తాము టేక‌ప్ చేస్తామ‌ని చెబుతోంది జ‌గ‌న్ పార్టీ. కానీ.. ఇదెంత వ‌ర‌కు? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో.. సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల విష‌యాన్ని ఏపీ అధికార‌ప‌క్షం ఎందుకంత సీరియ‌స్‌గా తీసుకుంటుంద‌న్న‌ది మ‌రో సందేహం.

ఒక‌వేళ అంత సీరియ‌స్ గా తీసుకున్న‌ప్పుడు.. మిగిలిన వారిపై పెట్టే పోస్టుల విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను ఎందుకు చేయ‌టం లేద‌న్న మాట‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్‌ ను చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అవుతున్న పోస్టుల మీద ఏపీ అధికార‌ప‌క్షం రియాక్ట్ కావ‌టం త‌ప్పేం లేదు కానీ.. అది ఓవ‌రాక్ష‌న్ చేస్తుంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగితే దాని వ‌ల్ల జ‌రిగే డ్యామేజ్ మ‌రింత ఎక్కువ అవుతుంద‌న్న విష‌యాన్ని పాల‌కులు గుర్తించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి.. ఆ స‌మ‌తూకాన్ని ఎవ‌రు మానిట‌ర్ చేస్తున్నార‌న్న‌ది చాలా ముఖ్యం. తూకం ఏ మాత్రం తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/