Begin typing your search above and press return to search.

జగన్ బ్యాచ్ కి రోజా మాటల షాక్?

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:27 AM GMT
జగన్ బ్యాచ్ కి రోజా మాటల షాక్?
X
ఒక మహిళా శాసనసభ్యురాలిపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయటం ఎంత దారుణమంటూ ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించటం తెలిసిందే. అసెంబ్లీలో నోరు పారేసుకున్న తన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చేందుకు ఏ మాత్రం మొహమాటపడని తీరుకు చెక్ చెప్పేలా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న వీడియో క్లిప్పింగులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో రోజా తీరు వివాదాస్పదంగా ఉందని.. ఆమె వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్న అభిప్రాయం కలిగేలా ఉన్న వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావటంపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది.

తమ సభ్యురాలిపై ఏడాదిపాటు వేటు వేయటం పై రాజకీయంగా ఆందోళనలు నిర్వహించాలని.. రోజా ఎపిసోడ్ తో బాబు సర్కారును దెబ్బ తీయాలని భావించిన జగన్ బ్యాచ్ ప్లానింగ్ ను దెబ్బ తీసేలా తాజాగా వీడియో విడుదల కావటం విపక్షానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. రోజా మాట్లాడిన మాటల వరకున్న క్లిప్పులు.. సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

రోజా మాటలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిపేలా ఉన్న క్లిప్పింగ్స్ తో జగన్ బ్యాచ్ డిఫెన్స్ లో పడే పరిస్థితి. అనుచిత వ్యాఖ్యలతో పాటు.. ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు కనిపిస్తున్న ఈ వీడియో క్లిప్పింగ్ తో రోజా వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం కావటం.. బాబు సర్కారు తీసుకున్న నిర్ణయం సమంజసమేనన్న భావన కలిగేలా వీడియో ఉండటం ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో.. వీడియో రోజా మాటలకు వివరణ ఇచ్చే విషయాన్ని వదిలేసిన జగన్ బ్యాచ్.. ఇప్పుడా వీడియో బయటకు ఎలా వచ్చిందో చెప్పాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 18న ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రోసీడింగ్స్ కు సంబంధించిన వీడియోక్లిప్పింగ్ లు ఇవ్వాలని తాము కోరితే ఇవ్వని ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో తమ పార్టీ నేత రోజాకు సంబంధించిన క్లిప్పింగులు రావటంపై జగన్ బ్యాచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాము రాతపూర్వకంగా అడిగితే ఇవ్వని వీడియో క్లిప్పింగులు.. ఆన్ లైన్లో ఎలా దర్శనమిచ్చాయన్న ప్రశ్నను సంధిస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు.. శాసనసభ ఇన్ ఛార్జ్ కార్యదర్శిని నిలదీస్తున్నారు. చూస్తుంటే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రోజా మాటల క్లిప్పంగ్ జగన్ పార్టీకి షాకింగ్ గా మారిందన్న అభిప్రాయం కలగక మానదు. కొసమెరుపేమంటే.. ఆన్ లైన్లో దర్శనమిస్తున్న రోజా వీడియో క్లిఫ్పింగ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తుంటే.. తాజాగా ఏపీ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్ లను స్పీకర్ అనుమతితో విడుదల చేయటం.