Begin typing your search above and press return to search.

నందినే ర‌ద్దు చేయాల‌నుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   20 Nov 2017 3:43 AM GMT
నందినే ర‌ద్దు చేయాల‌నుకుంటున్నారా?
X
మూడేళ్లుగా ప్ర‌క‌టించ‌ని నందుల‌ను ఒకేసారి ప్ర‌క‌టించ‌టం.. నంది అవార్డుల ప్ర‌దానోత్స‌వాన్ని భారీగా నిర్వ‌హించాల‌ని ఏపీ స‌ర్కారు భావించింది. ఇందుకు సంబంధించి భారీ ప్ర‌య‌త్నాల్నే చేప‌ట్టింది. నంది అవార్డుల ఫంక్ష‌న్ ను ప‌విత్ర న‌దీ జలాల సంగం ప్రాంతంలో భారీగా చేప‌ట్టి.. తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని త‌మ మీద ప‌డేలా చేయాల‌న్న ఆలోచ‌న చేసింది. ఇందుకు భిన్నంగా మొద‌టికే మోసం వ‌చ్చేలా నంది అవార్డుల వివాదం చోటు చేసుకుంది.

విభ‌జ‌న నేప‌థ్యంలో మూడేళ్లుగా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న చేప‌ట్ట‌లేదు. దీంతో మూడేళ్ల గ్యాప్ ను ఒకేసారి త‌గ్గించాల‌న్న ప్ర‌య‌త్నంతో క‌మిటీల‌ను నిర్వ‌హించి నందుల ప్ర‌క‌ట‌న చేసింది. అయితే.. నంది ప్ర‌క‌ట‌న రార్దాంతం చేయ‌టం.. ఏపీ స‌ర్కారు మీద లేనిపోని నింద‌ల‌కు దిగ‌టంపై ఏపీ స‌ర్కారు య‌మా సీరియ‌స్ గా ఉంద‌ని చెబుతున్నారు.

నంది ర‌చ్చ శ్రుతిమించితే.. నంది అవార్డుల్ని ర‌ద్దు చేసి పారేయాల‌న్న ఆలోచ‌న‌లో ఏపీ ప్ర‌భుత్వం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ద‌శాబ్దాలుగా ఇస్తున్న అవార్డుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌తిసారీ ఏదో ఒక వివాదం తెర మీద‌కు రావ‌టం జ‌రుగుతోంద‌ని.. ఈసారి మోతాదు మించింద‌ని.. ఈ వ్య‌వ‌హారం ఏపీ ప్ర‌భుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నంది అవార్డులకు సంబంధం లేని అంశాల్ని తెర మీద‌కు తెచ్చి విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి సినీ అవార్డులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఇస్తుంద‌ని.. ఈ లెక్క‌న చూస్తే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మొత్తం హైద‌రాబాద్ లోనే ఉంది. హీరోలు మొద‌లు సాంకేతిక నిపుణులు అంతా హైద‌రాబాద్ లోనే ఉన్నారు. వారి ఆస్తుల‌న్నీ అక్క‌డే ఉన్నాయి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆఫీసులు ఉన్నా.. ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్నీ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. వారి ప‌న్ను చెల్లింపులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే జ‌రుగుతున్నాయి. అయితే.. ఇలాంటి వాటిని ప‌ట్టించుకోకుండా తెలుగువారంతా ఒక్క‌టే అన్న మాట‌తో అవార్డుల ఫంక్ష‌న్ ను భారీగా చేప‌ట్టాల‌ని భావించారు.

అది కాస్తా ఊహించ‌ని రీతిలో వివాదంగా మార‌టంపై ఏపీ స‌ర్కారు అసంతృప్తితో ఉంది. ఈసారి అవార్డు గ్ర‌హీత‌ల్లో అధిక శాతం ఏపీకి చెందిన వారు కాద‌ని.. క‌నీసం వారికి ఏపీలో ఎక్క‌డా ఓటుహ‌క్కు కూడా లేద‌ని.. అయిన‌ప్ప‌టికీ వారిని గౌర‌వించాల‌ని తాము భావిస్తే.. త‌మ మీద లేనిపోని ముద్ర‌లువేయ‌టంపై ఏపీ స‌ర్కారు గుర్రుగా ఉంద‌ట‌. ప్ర‌వాసాంధ్రులు విదేశాల్లో ఉన్నా.. తాముసంపాదించిన మొత్తాన్ని ఏపీలో పెట్టుబ‌డి పెట్టి భూములు కొంటున్నార‌ని.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు తెలంగాణ‌లో నివ‌సిస్తున్నార‌ని.. వారి తీరు భిన్నంగా ఉంద‌న్న వాద‌న‌ను ఏపీ ప్ర‌భుత్వంలోని కొంద‌రు వినిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అవార్డుల ఎంపిక‌కు సంబంధించి పూర్తి స్వేచ్ఛ క‌మిటీకి ఉంద‌ని.. ప్ర‌భుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేద‌ని.. అయిన‌ప్ప‌టికీ త‌మ‌ను త‌ప్పు ప‌ట్టేలా నందుల వివాదం తెర మీద‌కు రావ‌టం.. అంత‌కంత‌కూ ముద‌ర‌టంపై స‌ర్కార్ సీరియ‌స్ గా ఉండ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే నందుల ప్ర‌క‌ట‌న‌ను నిలిపివేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. తెలుగోడిని స‌న్మానిద్దామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తే.. తాజా వివాదం బాబు స‌ర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింద‌న్న అభిప్రాయాన్ని ఏపీ స‌ర్కారుకు చెందిన ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ స‌ర్కారు సీరియ‌స్ నెస్ బ‌య‌ట‌కు రాక‌పోగా.. తాజాగా మాత్రం ఆ సంకేతాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.