Begin typing your search above and press return to search.

అమరావతి ప్రజలకు వరాలే వరాలు..

By:  Tupaki Desk   |   18 May 2016 8:24 AM GMT
అమరావతి ప్రజలకు వరాలే వరాలు..
X
ఏపీ నూతన రాజధాని అమరావతిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో నమ్మకాలు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి ప్రజల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల కంటే కూడా రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి ప్రజలకు మరింత మేలు చేయాలని తలపోస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన వారికి వచ్చే పదేళ్ల వరకు ఎలాంటి కష్టం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలకు ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. కోరిందే తడవుగా 34 వేల ఎకరాలు ఇచ్చిన ప్రజల కోసం ఏమైనా చేస్తానంటూ ముఖ్యమంత్రి వారికోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో సీఆర్డీయే అధికారులు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి వాసుల సమగ్రాభివృద్ధికి చంద్రబాబు సూచనలతో ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.

ముఖ్యంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే 29 గ్రామాల్లోని యువతను గుర్తించి వారకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు.

మరోవైపు విద్య అవసరాన్ని గుర్తించి అమరావతి ప్రాంతంలో పదేళ్ల పాటు ఉచిత విద్యను అమలు చేస్తున్నారు. పదో తరగతి - ఇంటర్ - ఢిగ్రీతో పాటు పాలిటెక్నిక్ - ఇంజినీరింగ్ వంటి కోర్సులన్నీ ఉచితంగాచదువుకునేలా ఈ ఏడాది నుంచి విధానం అమల్లోకి వస్తోంది. ఇది కాకుండా సీఆర్డీయే పరిధిలోని 29 గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చేసింది. ప్రభుత్వ - ప్రయివేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కాకుండా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీయే పక్కా ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలకు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని గ్రామాలను కలిపేలా రోడ్లను నిర్మిస్తున్నారు. ఎల్ ఈడీ వీధి దీపాలు - పక్కా డ్రైనేజి వ్యవస్థ వంటివాటితో స్థానికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు.