Begin typing your search above and press return to search.

రాజధానిలో మొదలైన వలసలు!

By:  Tupaki Desk   |   9 July 2015 3:30 PM GMT
రాజధానిలో మొదలైన వలసలు!
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఇప్పటి వరకూ భూలోక స్వర్గం! పచ్చని లోకం. కానీ ఇప్పుడు అది కాంక్రీట్‌ జంగిల్‌ కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ నేల ఎంతోమందికి ఉపాధి కల్పించింది. కానీ, ఇప్పటి వరకూ ఈ నేల కల్పించిన ఉపాధి వేరు. ఇకనుంచి కల్పిచబోయే ఉపాధి వేరు. ఇప్పటి వరకూ ఇక్కడ జీవనోపాధి పొందినవాళ్లకు భవిష్యత్తులో భద్రత ఉండే అవకాశం లేదు. అందుకే వాళ్లంతా ఇప్పుడు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిపోతున్నారు. నిజానికి, రాజధాని నిర్మాణం ప్రారంభం అయిన తర్వాత ఈ పరిస్థితి వస్తుందని భావించారు. కానీ, చాలాముందుగానే వలసలు మొదలయ్యాయి.

వ్యవసాయం ఆగిపోయింది. దానికితోడు ప్రభుత్వం ఇస్తామన్న సామాజిక భద్రతా పింఛన్లు కూడా చేతికి అందడం లేదు. దాంతో బతుకు భారమైంది. దాంతో రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు, కార్మికులు వలస బాట పట్టారు. మొత్తం 29 గ్రామాల్లోని దాదాపు ఐదారు వేల మంది ఇప్పటికే విజయవాడ, గుంటూరు వంటి నగరాలు, ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ భూములు అమ్ముకున్న కొంతమంది పొరుగు జిల్లాల్లో భూములు కొనుక్కున్నారు. దాంతో కొంతమంది కార్మికులు అక్కడికి వెళ్లి అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. మిగిలిన వారు ఇతర రంగాలకు వలస వెళుతున్నారు.

రాజధాని సర్వేలో భాగంగా ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది వ్యవసాయ కూలీలు, కార్మికులు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరిలో 54 వేల మంది వ్యవసాయ కార్మికులు, 12 వేల మంది కూలీలు, మరో 12 వేల మంది సేద్యం దాని ఆధారిత రంగాల్లో జీవనోపాధి పొందుతున్నారని గుర్తించింది. వీరందరికీ సామాజిక పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. నిజానికి గత రెండు నెలల నుంచే రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. దాంతో ఇప్పటికే దాదాపు 75 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఏ పూటకు ఆ పూట సంపాదిస్తేనే కానీ పూట గడవని కూలీలు ఇక ఇక్కడ ఉండి ఉపయోగం లేదని వలస బాట పట్టారు. కొంతమంది నిర్మాణ పనులకు మరికొంతమంది ఇతర పనులకు కుదురుకుంటున్నారు. ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛనును వెంటనే అమలు చేయాలని వారంతా కోరుతున్నారు.