Begin typing your search above and press return to search.

ఏపీలోనూ స్థానికత వివాదం

By:  Tupaki Desk   |   2 Oct 2015 10:30 PM GMT
ఏపీలోనూ స్థానికత వివాదం
X
తెలంగాణ ప్రభుత్వం స్థానికత విషయంలో ఒక వివాదం సృష్టించింది. దానిని ఏకంగా ఏడాదిపాటు కొనసాగించి ఎట్టకేలకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంది. తాజాగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా స్థానికత వివాదానికి తెరతీసింది.

ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఇంకా శంకుస్థాపన జరగలేదు. ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో వెళ్లలేదు. నవ్యాంధ్రలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క కంపెనీ రాలేదు. హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రమైన నవ్యాంధ్రకు వెళ్లి పోదామని భావించే వాళ్లకు ఒక్క చిన్న భరోసా కూడా దొరకడం లేదు. అక్కడికి వెళ్లిపోతే ఉపాధి దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రైవేటు కంపెనీలు కూడా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించిన తర్వాత మాత్రమే నవ్యాంధ్రకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రైవేటు కంపెనీ కూడా నవ్యాంధ్రకు వెళ్లలేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా స్థానికతను నిర్ణయించేసింది. 2017 జూన్ రెండో తేదీలోపు వెళ్లేవాళ్లకే నవ్యాంధ్ర స్థానికత ఇస్తామని, ఆ తర్వాత వచ్చేవారు స్థానికేతరులేనని ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించేసింది.

ప్రభుత్వ కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో నవ్యాంధ్ర వెళ్లే పరిస్థితి లేదు. విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికీ స్థలానికి కొరతగానే ఉంది. ఇక అమరావతి నిర్మాణం జరిగితే తప్ప ప్రైవేటు కార్యాలయాలు వెళ్లడానికి సుముఖంగా లేవు. దానికితోడు హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది కనక కొన్ని సంస్థలు అయితే కాస్త నెమ్మదిగానే నవ్యాంధ్రకు వెళ్లాలని భావిస్తున్నాయి. మరికొందరికి ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఉన్నా.. వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే నిర్ణయం వాళ్ల చేతుల్లో ఉండడం లేదు. వాళ్లు పని చేసే కంపెనీలు నవ్యాంధ్రకు ఎప్పుడు వెళ్లాలనని నిర్ణయిస్తే వాళ్లు కూడా అప్పుడే వెళ్లాల్సిన పరిస్థితి. ఆయా కంపెనీలు కూడా 2019లోనూ ఆ తర్వాతా వెళ్లడానికి ప్రణాళికలు రచించుకుంటున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2017 జూన్ రెండో తేదీ అని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిలదీస్తున్నారు. మెడికల్ సీట్ల విషయంలోనో మరొక విషయంలోనో ఇబ్బంది వస్తుందని చెప్పి వేలాదిమందిని ఎలా ఇబ్బందులకు గురి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ సీమాంధ్ర స్థానికులే అయితే.. వాళ్లు హైదరాబాదు నుంచో తెలంగాణ నుంచో సీమాంధ్రకు రావాలని అనుకుంటే ఆ తర్వాత కూడా కనీసం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లూ అయినా వారికి స్థానికత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికత విషయంలో చంద్రబాబు కూడా కేసీఆర్ బాటలో నడవరాదని, కేసీఆర్ తరహాలో ద్వేషపూరితంగా, ఆలోచన రహితంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

కొసమెరుపు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు అక్కడికి వెళ్లాలి అనిపించేలా అమరావతి ప్రాథమిక దశ పూర్తవుతుందని, అప్పటికి తెలంగాణకు మించి అక్కడ భరోసా కలుగుతుందని అందుకే ఏడాదిన్నర గడువు సరిపోతుందని టీడీపీ వర్గాలు దీనిని సమర్థిస్తున్నాయి. అది జరుగుతుందా అన్నదే కదా ప్రశ్న!