Begin typing your search above and press return to search.

తాజా తాత్కాలికానికి రూ.515 ఖర్చు

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:26 AM GMT
తాజా తాత్కాలికానికి రూ.515 ఖర్చు
X
మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అనుకుందాం. మీరు ఉండటానికి ఇల్లు కావాలని అనుకుందాం. మీరేం చేస్తారు? మరింత అప్పు చేసి ఇల్లు కట్టుకుంటారా? లేదంటే.. ఆర్థిక ఇబ్బందులు ఒక కొలిక్కి వచ్చే వరకూ పొదుపుగా వ్యవహరిస్తూ.. అద్దె ఇంట్లో ఉంటారా? ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా.. రెండో ఆప్షన్ కే ఓటు వేస్తారు. నిజానికి ఇంతకు మించి మరో ఆప్షన్ కూడా లేదు.

కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వేరు. ఆయన ఆలోచనలన్నీ చిత్రవిచిత్రంగా ఉంటాయి. విభజన కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని మరింత అప్పుల్లోకి దించేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు.. పర్మినెంట్ భవనాల్ని నిర్మించటం వదిలేసి.. అదరాబాదరాగా తాత్కాలికం మీద ఆయన ప్రదర్శిస్తున్న మోజు చూస్తే ఏమనాలో అర్థం కాదు.

విభజన జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలీని వేళ.. హైదరాబాద్ లోని సెక్రటేరియ ట్ లో ఏర్పాటు చేసిన సీఎం పేషీని దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసి.. అధునాతన హంగులతో సిద్ధం చేశారు. ఇందులో పట్టుమని పది రోజులు కూడా చంద్రబాబు కూర్చున్నది లేదు. ఇక.. హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయ్యాక.. తాత్కాలిక భవనాల పేరిట భారీగా భవనాల్ని నిర్మిస్తున్న వైనం విమర్శలకుగురి అవుతోంది.

ఇప్పటికే వేలాది కోట్లు తగలబెట్టేసి తాత్కాలిక ఏపీ సెక్రటేరియట్ కట్టేసిన చంద్రబాబు.. తర్వాతి రోజుల్లో పర్మినెంట్ సెక్రటేరియట్ కడతామని చెబుతున్నారు. రెండు ఆలస్యమైనా.. శాశ్విత భవనాల్ని నిర్మించాల్సింది పోయి తాత్కాలిక భవనాలు ఎందుకన్నది అర్థం కాదు. ఇప్పుడీ తాత్కాలిక భవనాల నిర్మాణంలో మరొకటి వచ్చి చేరింది. తాత్కాలిక అసెంబ్లీ.. మండలి భవనాల్ని సిద్ధం చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.515 కోట్లు ఖర్చుచేసినట్లుగా ఏపీ సర్కారు వెల్లడించింది. భవిష్యత్తులో శాశ్విత అసెంబ్లీని నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇలా తాత్కాలికం కోసం వందలాది కోట్లు.. శాశ్విత నిర్మాణాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టేస్తూ పోతే.. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుపడేది ఎప్పుడు? ఏపీ ప్రజలు బతుకులు మారేది ఎప్పుడు? ఈ తరహా భారీ ఖర్చుల్ని బాబు ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వందల కోట్ల రూపాయిలు తగలబెట్టేసి తయారు చూసిన భవనాల షోకుల్ని.. వాటి అందాల్ని వర్ణిస్తూ.. తామెంత పోటుగాళ్లమో ప్రచారం చేసుకుంటున్న వారు.. ఖర్చు పెట్టిన వందల కోట్లు రానున్న రోజుల్లో వృధా ఖర్చుగా మారుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆ బాధ్యతను ఎవరు తీసుకోనున్నారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/