Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ‘ఏపీ దుకాణం’ మూసేస్తారా?

By:  Tupaki Desk   |   31 May 2016 7:36 AM GMT
హైదరాబాద్ లో ‘ఏపీ దుకాణం’ మూసేస్తారా?
X
విభజన చట్టం ప్రకారం ఏపీకి పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఈ పదేళ్ల వ్యవధిలో ఏపీ సర్కారు తన పరిపాలనను ఆంధ్రాకి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. విభజన చట్టంలో ఇచ్చిన సౌలభ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట్లో అనుకున్నా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన యుద్ధప్రాతిపదికన అమరావతికి వెళ్లిపోయారు.

తనతో పాటు హైదరాబాద్ లో ఉన్న సచివాలయాన్ని కూడా తరలించాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. కొన్ని ప్రయత్నాల అనంతరం జూన్ 27 నాటికి మొత్తంగా ఏపీ సచివాలయాన్ని సంపూర్ణంగా అమరావతిలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి షిఫ్ట్ చేయాలని డిసైడ్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అనుకున్న సమయానికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయాన్ని మొత్తంగా ఖాళీ చేస్తే.. ఏపీకి కేటాయించిన భవనాల్ని ఏం చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీకి కేటాయించిన భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే అప్పగించాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేసిన తర్వాత కూడా తమ వద్దే అట్టి పెట్టుకోవటం అనవసరమన్న భావనలో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. తరలింపు కార్యక్రమం పూర్తి అయిన వెంటనే.. భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండోవర్ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే హైదరాబాద్ లో ఏపీ దుకాణం బంద్ అయినట్లేనని చెప్పక తప్పదు.