Begin typing your search above and press return to search.

ఏపీ గవర్నమెంటుపై గొప్పల భారం

By:  Tupaki Desk   |   18 Feb 2016 11:30 AM GMT
ఏపీ గవర్నమెంటుపై గొప్పల భారం
X
అంతంతమాత్రంగా ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత అతలాకుతలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాడుక నుంచి ఉపసంహరించిన భారీ యుద్దనౌకు తీసుకుని దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఏపీ గవర్నమెంటు చేస్తున్న ప్రయత్నాలు పెను భారంగా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత నౌకాదళం ఆధీనంలో ఉన్న పురాతన యుద్ధ నౌక ఐఎన్‌ ఎస్ విరాట్‌ ను మ్యూజియంతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్‌ గా మార్చి పర్యాటక రంగానికి కొత్త ఊపు తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే యుద్ధ నౌకను మ్యూజియం - హోటల్‌ గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలంటే ఆషామాషీ కాదు. విరాట్‌ ను ముట్టుకుంటేనే రూ. 700 కోట్లు కావాలి. నిధుల కొరత ఉన్నప్పటికీ విరాట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎపి సర్కారు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలని... ఏమైనా తేడా వస్తే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లవుతుందని అంటున్నారు.

విరాట్ యుద్ధ నౌక ఆరు దశాబ్దాల పాటు నావికాదళానికి సేవలందించింది. బ్రిటీష్ నేవీలో 30 ఏళ్లపాటు ఉన్న విరాట్ ఆ తర్వాత 1987లో భారత నావికాదళంలో చేరింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో విరాట్ పాల్గొంది. విరాట్‌ ను విశాఖకు తీసుకు రావడంలో సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పర్యాటక శాఖ అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించింది. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం ప్రాజెక్టుకు రూ.700 ఖర్చు అవుతుందని తేల్చింది. దీనిలో యుద్ధనౌకలో అంతర్గతంగా ఉన్న నిర్మాణాన్ని తొలగించి (డికమిషన్) తీసుకువచ్చేందుకే రూ.400 కోట్లు ఖర్చు అవుతుంది. డికమిషన్ చేసే సౌకర్యం కేవలం కొచ్చిన్‌ లోనే ఉంది. అనంతరం దానిని మ్యూజియంగా, హోటల్‌ గా మార్చేందుకు మరో రూ.300 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేసింది. నిధుల కొరతతో ఉన్న ఆంధ్ర ప్రభుత్వం నావికాదళం నుంచే ఆర్థిక సహాయాన్ని తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే... 700 కోట్ల తో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ఆదాయం వస్తుందన్నది అనుమానమే.

విశాఖపట్నంకు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టు విశాఖపట్నంలో ఉంటేనే బాగుంటుందని కేంద్రప్రభుత్వం భావించి ఇప్పటికే అంగీకారం తెలిపింది. గోవా - గుజరాత్ రాష్ట్రాలు విరాట్ కోసం ప్రయత్నిస్తున్నా, కేంద్రం మాత్రం ఎపి వైపే మొగ్గు చూపుతోంది. విరాట్ ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దానిలో స్పోర్ట్స్ - యాచ్టింగ్ - సెయిలింగ్ - గ్లైడింగ్ - క్రూయిజింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు అవుతాయి. ఐదు నక్షత్రాల శ్రేణి హోటల్ 1500 గదులతో ఏర్పాటు చేసేందుకు వీలుంటుందని ప్రభుత్వం తన అధ్యయన నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. విరాట్ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చుకోగలిగితే అమెరికా - చైనా తర్వాత యుద్ధనౌకను ఇలా మార్చుకున్న మూడవ దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేసినా మంచిదేననే అభిప్రాయాన్ని అధ్యయన నివేదిక వెల్లడించినట్లు సమాచారం. అయితే... గతంలో ఐఎన్‌ ఎస్ విక్రాంత్ అనే యుద్ధ నౌకను మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ ప్రాజెక్టును ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన నేపథ్యంలో ఏపీ ఈ విషయంలో ముందు జాగ్రత్త పడకపోతే అభాసుపాలయ్యే ప్రమాదముంది.