Begin typing your search above and press return to search.

బాబుకు ఓట‌మి!... ఏబీ ట్రాన్స్ ఫ‌ర్‌!

By:  Tupaki Desk   |   29 March 2019 11:18 AM GMT
బాబుకు ఓట‌మి!... ఏబీ ట్రాన్స్ ఫ‌ర్‌!
X
కీల‌క ఎన్నిక‌ల ముందు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ‌రుస త‌ప్పులు చేస్తున్న‌ట్లుగా తేలిపోయింద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా... స‌ర్వాధికారాలు క‌లిగి ఉండే కేంద్ర ఎన్నిక‌ల సంఘంతోనే ఢీకొట్టిన చంద్ర‌బాబు స‌ర్కారు... హైకోర్టు వేదిక‌గా బొక్క బోర్లా ప‌డిపోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార ప‌క్షానికి తొత్తులుగా వ్య‌వ‌హ‌రించే అధికారుల‌ను త‌ప్పించ‌మ‌ని విప‌క్షాలు కోర‌డం కొత్తేమీ కాదు. అలాగ‌ని విప‌క్షాల అభ్య‌ర్థ‌న‌ల‌ను ఈసీ ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవ‌డం కూడా కొత్త కాదు. అంతేకాకుండా ఈసీకి విప‌క్షం ఇచ్చిన ఫిర్యాదుల‌పై అధికార ప‌క్షం ఆగ్ర‌హం చేయ‌డం, చ‌ర్య‌లు తీసుకున్న ఈసీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కూడా మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసీ చ‌ర్య‌ల‌ను స‌వాల్ చేస్తూ కోర్టుల‌కెక్క‌డ‌మే కొత్త‌. ఈ కొత్త సంప్ర‌దాయానాకి తెర తీసిన చంద్ర‌బాబుకు నిజంగానే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిందన్న వాద‌న వినిపిస్తోంది.

అధికార టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించడ‌మే కాకుండా విప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీలోకి జంప్ అయ్యేలా భ‌య‌పెడుతున్నార‌ని ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీనియ‌ర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వ‌ర‌రావుపై ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ఏబీకి చంద్ర‌బాబు కీల‌క ప‌నుల‌న్నీ అప్ప‌జెబుతూ గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌నులు లాగించేస్తున్నార‌ని కూడా ఆరోప‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే వైసీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స్వ‌యంగా ఫిర్యాదు చేసింది. ఏబీ లాంటి అధికారి ఉంటే... నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు ఎలా జ‌రుగుతాయ‌ని ప్ర‌శ్నించిన వైసీపీ... ఆయ‌న‌ను త‌ప్ప‌నిస‌రిగా బదిలీ చేయాల్సిందేన‌ని కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైట్ ను ప‌రిశీలించిన ఈసీ... మొన్న ఏబీతో పాటు శ్రీ‌కాకుళం, క‌డ‌ప జిల్లాల ఎస్పీల‌ను కూడా బ‌దిలీ చేసేసింది. దీనిపై నానా ర‌చ్చ చేసిన చంద్ర‌బాబు... ఏకంగా ఏబీని బదిలీ చేస్తున్న ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసి... అస‌లు ఏబీ ఎన్నిక‌ల ప‌రిధిలోకే రారంటూ కొత్త డ్రామాల‌కు తెర తీసింది. దీనిపై కోర్టుకు కూడా వెళ్లింది.

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు స‌ర్కారుపై ఈసీ కూడా త‌న‌దైన స‌మాధానాన్ని సిద్ధం చేసుకుని కోర్టుకు వెళ్లింది. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు... ఈసీ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోలేమ‌ని తేల్చి చెప్పింది. ఈ దెబ్బ‌తో ఖంగుతిన్న చంద్ర‌బాబు స‌ర్కారు.... ఏబీని ఇంటెలిజెన్స్ డీజీ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌క త‌ప్ప‌లేదు.కోర్టు ఆదేశాల‌తో దిగివ‌చ్చిన చంద్ర‌బాబు స‌ర్కారు ఇంటెలిజెన్స్ చీఫ్ ప‌ద‌వి నుంచి ఏబీని త‌ప్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌ లో రిపోర్టు చేయాలంటూ ఆయ‌న‌కు ఆదేశాలు జారీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విస్ప‌ష్టంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. మొత్తంగా దేశంలో ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాటైన కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్నే త‌ప్పుబ‌ట్టే రీతిగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తే కుద‌ర‌ద‌ని చంద్ర‌బాబు ఉదంతంతో మ‌రోమారు రుజువైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారంలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే ఓట‌మిని అంగీక‌రించిక త‌ప్ప‌ద‌లేద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.