Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి 2.30 గంట‌ల త‌ర్వాతా ఏపీ హైకోర్టు విచార‌ణ!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:20 AM GMT
అర్థ‌రాత్రి 2.30 గంట‌ల త‌ర్వాతా ఏపీ హైకోర్టు విచార‌ణ!
X
అరుదుగా చోటు చేసుకునే ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 2.30 గంట‌లు దాటిన త‌ర్వాత కూడా ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం ఒక‌టి.. అత్య‌వ‌స‌ర అంశంపై విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన ధ‌ర్మాస‌నం.. కేసు విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది. ఇంత‌కీ ఇంత అర్థ‌రాత్రివేళ‌లో ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం విచారించిన కేసు ఏమిట‌న్న విష‌యాల్లోకి వెళితే..

కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట‌పై మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసానికి ప‌క్క‌నే ఉన్న ప్ర‌జావేదిక‌ను కూల్చివేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే. అక్ర‌మ నిర్మాణాల్ని ప్ర‌భుత్వ‌మే నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు వెలువ‌డ‌తాయి? అని ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. తాను అంద‌రికి ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకే రెండు రోజుల పాటు క‌లెక్ట‌ర్లు.. ఎస్పీల స‌ద‌స్సును నిర్వ‌హించిన‌ట్లుగా చెప్పి.. త‌మ స‌మావేశాలు పూర్తి అయిన వెంట‌నే ప్ర‌జావేదిక‌ను కూల్చివేస్తామ‌ని చెప్పిన‌ట్లే.. నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి నుంచి కూల్చివేత ప‌నులు మొద‌ల‌య్యాయి.

ఇదిలా ఉంటే.. ప్ర‌జావేదిక భ‌వ‌నం కూల్చివేత‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని కోరుతూ ప్ర‌కాశం జిల్లా కారంచేడు మండ‌లం స్వ‌ర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్య‌క‌ర్త పి. శ్రీ‌నివాస‌రావు వ్యాఖ్యాన్ని దాఖ‌లు చేశారు. ప్ర‌జావేదిక‌ను కూల్చివేయ‌టం ద్వారా ప్ర‌జాధ‌నం వృధా అవుతుంద‌న్నారు. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌పై ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్న త‌ర్వాతే కూల్చివేయాల‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం ఈ ప్ర‌జాహిత వాజ్యంపై విచార‌ణ జ‌రిపింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 2.30 గంట‌లు దాటిన త‌ర్వాత కూడా హైకోర్టు జడ్జిలు వాద‌న విన్నారు. హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సీతారామ‌మూర్తి.. జ‌స్టిస్ శ్యాంప్ర‌సాద్ లు ఈ వ్యాజ్యాన్ని విచారించారు. పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌కు భిన్నంగా అక్ర‌మ నిర్మాణాల విష‌యంలో క‌ఠినంగా ఉండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్న అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌తో ఏకీభ‌వించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ప్ర‌జావేదిక కూల్చివేత‌ను ఆపేయ‌టానికి అనుమ‌తి నిరాక‌రించింది. ఈ కేసు విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు ఉత్త‌ర్వులు ఉండాల‌ని.. అలాంటివేమీ లేవ‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ప్ర‌భుత్వంలోని ఒక శాఖ నిర్మించిన భ‌వ‌నం.. మ‌రో శాఖ అక్ర‌మంగా తేల్చిన‌ప్పుడు స‌ద‌రు శాఖ నుంచి వివ‌ర‌ణ తీసుకోవాల‌న్నారు. ఏక‌ప‌క్షంగా ప్ర‌జావేదిక‌ను కూల్చివేశార‌ని.. దీనిపై అసెంబ్లీ చ‌ర్చ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకొని ఉంటే బాగుండేద‌న్నారు. అయితే.. కోర్టు ఈ వాద‌న‌కు సానుకూలంగా స్పందించ‌లేదు.