Begin typing your search above and press return to search.

రాజధాని తరలింపుపై హైకోర్టు సూటిగా తేల్చేసిందిగా..

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:50 AM GMT
రాజధాని తరలింపుపై హైకోర్టు సూటిగా తేల్చేసిందిగా..
X
రాజధానిని విశాఖకు తరలించాలన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అమలు కావటానికి మరికొంత సమయం తీసుకునేలా ఉంది. ఆయన కోరుకున్నట్లుగా ఇప్పటికప్పుడు రాజధాని తరలింపు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు సైతం స్పష్టంగా చెప్పేసింది. రెండు బిల్లుల విషయంలో మండలి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన నేపథ్యంలో.. కమిటీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి అడుగులు పడనున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న యథాతధ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.

ఏపీ రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టు రియాక్ట్ అవుతూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. ఈలోపు మాత్రం ప్రభుత్వం కార్యాలయాల తరలింపు విషయంలో తదుపరి చర్యలకు దిగ కూడదని స్పష్టం చేసింది. ఒకవేళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని చెప్పేసింది.

తమకు అధికారాలులేవని అనుకోవద్దని.. తమ మాటను వినకుండా ధిక్కరిస్తే మాత్రం.. తరలి వెళ్లిన కార్యాలయాల్ని సైతం వెనక్కి రప్పిస్తామని.. అందుకైన ఖర్చుల్ని బాధ్యులైన వారి జేబుల నుంచే వసూలు చేయిస్తామని ఒకింత ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో.. రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్ల తదుపరి విచారణను ఫిబ్రవరి 26 తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజధాని తరలింపు ఫిబ్రవరి 26 వరకూ ఏమీ ఉండదని చెప్పక తప్పదు.

దీనికి సంబంధించిన కీలక ఆదేశాల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి - జస్టిస్‌ ఏవీ శేషసాయి - జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు.. పాలనా వికేంద్రీకరణ-సమగ్రాభివృద్ధి బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాల్ని జారీ చేసింది. రాజధాని వ్యవహారంపై విచారణ జరిపిన సందర్భంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. లాయర్లు.. పెద్ద ఎత్తున పిటిషన్లు రావటంతో పాటు పలువురు నేతలు కోర్టుకు హాజరై.. ప్రొసీడింగ్స్ ను ఆసక్తిగా తిలకించారు. ఇరు వర్గాల వాదనలు ఆసక్తికరంగా సాగాయి.