Begin typing your search above and press return to search.

హైకోర్టు అక్కడే.. ప్లేస్ కన్ఫర్మ్?

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:11 AM GMT
హైకోర్టు అక్కడే.. ప్లేస్ కన్ఫర్మ్?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని అంతా ఒకే చోట అంటూ హడావుడి చేశారు. నవనగరాలు అంటూ గ్రాఫిక్స్ వేసి చంద్రబాబు నాయుడు ఏదో కబుర్లు చెప్పారు. అయితే అవన్నీ కబుర్లుగానే మిగిలిపోయాయి. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలన అనంతరం మిగిలింది రెండు మూడు తాత్కాలిక భవనాలు - గ్రాఫిక్స్ మాత్రమే.

ఇక రాజధాని విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బాట పట్టారు. వికేంద్రీకరణతో రాజధానిని నలుమూలలకూ తీసుకెళ్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఈ నేపథ్యంలో హైకోర్టును రాయలసీమకు కేటాయించేందుకు జగన్ సమాయత్తం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

విభజన అనంతరం రాజధానే తమ ప్రాంతానికి కేటాయించాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేశారు. అయితే రాజధాని అప్పుడు దక్కలేదు. ఈ నేపథ్యంలో కనీసం హై కోర్టును అయినా రాయలసీమలో ఏర్పాటు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా ఊహాగానాలున్నాయి.

ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణలు లేకపోయినా.. హై కోర్టు కర్నూలు కే అనే ప్రచారం అయితే గట్టిగా ఉంది.ఈ నేపథ్యంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు సమీపంలో హై కోర్టు ఏర్పడుతుందని పుకార్లున్నాయి. దీంతో కల్లూరు అనే ఆ సమీప ప్రాంతంలో రియలెస్టేట్ కూడా పుంజుకుంది. ఎయిర్ పోర్టు సమీపంలోని ఆ ఊర్లో హై కోర్టు ఏర్పాటు అవుతుందనే ప్రచారంతో అక్కడ భూముల అమ్మకాలు - కొనుగోళ్లు ఊపందుకుంటుండటం గమనార్హం.