Begin typing your search above and press return to search.

ఇళ్లు వెతుక్కుంటున్న ఐఏఎస్ లు

By:  Tupaki Desk   |   20 Aug 2015 11:21 PM IST
ఇళ్లు వెతుక్కుంటున్న ఐఏఎస్ లు
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఐఏఎస్ లు , ఇతర ఉన్నతాధికారులు ఇళ్లు వెతుక్కునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి నాలుగు రోజులపాటు విజయవాడ నుంచే పాలన సాగించడం.. ఇప్పటికే ఆయన క్యాంపు కార్యాలయం సిద్ధం కావడం.. త్వరలో నివాసం కూడా సిద్ధం అవుతుండడంతో ఐఏఎస్ లు, ఇతర అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు షటల్ జర్నీ చేయడం తప్పనిసరి అవుతోంది. ఇది వారికి ఇబ్బందికరంగా కూడా మారుతోంది. అదే సమయంలో.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ తరలి వెళ్లాల్సిందే. మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలో చెప్పండి. ఇళ్ల అద్దెలు, టీఏ, డీఏల చెల్లింపు వంటి అన్ని అంశాల్లో మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మీరు మాత్రం త్వరగా ఇక్కడినుంచి కదలాల్సిందే’’ అని సీఎంవో నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక వారు కూడా ఇళ్లు వెతుక్కునే పనిలో పడ్డారు.

వివిధ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే వరకు ఇప్పటి వరకు అక్కడ ఉన్న కార్యాలయాల నుంచే పనులను మొదలు పెట్టాలని కూడా సూచనలు అందాయి. ఆ తర్వాత నిదానంగా కార్యాలయాలకు కావాల్సిన భవనాలను వెతుక్కుని అందులోకి మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దాని ప్రకారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు ముఖ్యమంత్రి పేషీకి సంబంధించిన అధికారులకు సీఎం క్యాంపు కార్యాలయంలో గదులను ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎల్ ఏ విభాగం, దాని ఉన్నతాధికారులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాయాల్లో సర్దుకోనున్నారు. పశు సంవర్థక శాఖ డైరెక్టరేట్ లబ్బీపేట లోని ఆ శాఖ కార్యాలయంలో ఏర్పాటు కానుంది. ఇదే తరమాలో వివిధ విభాగాలను కూడా వాటి స్థానిక కార్యాలయాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.