Begin typing your search above and press return to search.

జెండాపండుగ మళ్లీ రాయలసీమలోనే..?

By:  Tupaki Desk   |   16 July 2016 10:51 AM GMT
జెండాపండుగ మళ్లీ రాయలసీమలోనే..?
X
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేకుండానే పాలనను నెట్టుకొస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట రాజధాని కోసం భూసేకరణ పూర్తి చేసిన చంద్రబాబు సర్కారు... ప్రస్తుతానికి అక్కడి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ తాత్కాలిక సచివాలయం కూడా ఈ నెలాఖరు నాటికి గాని పూర్తి కాదు. మరి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించాలి? రాష్ట్ర విభజన తర్వాత తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాయలసీమ ముఖద్వారం కర్నూలులో నిర్వహించిన ప్రభుత్వం తాజాగా ఆ వేడుకలను ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.

ఈ దఫా కూడా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) గ్రౌండ్ ను ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే పరిశీలించారు. పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై త్వరలోనే ఓ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మొదటి నుంచీ సువ్వవస్థీకృతమైన హైదరాబాద్ రాజధానిగా ఉండడంతో అక్కడే ప్రతి కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ.. ఏపీ పరిస్థితి వేరు. అసలు విభజనే అడ్గగోలుగా చేశారన్న కోపంతో చంద్రబాబు ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించం లేదు. అలాగే రాజధాని లేకపోవడంతో గత ఏడాది ఆగస్టు 15 వేడుకలు కూడా కర్నూలులో జరిపారు. ఈసారి కూడా కొత్త రాజధాని అమరావతి సిద్ధం కాకపోవడం.. పొరుగునే ఉన్న విజయవాడలో పుష్కరాలు జరుగుతుండడంతో ఆగస్టు 15ని అక్కడ నిర్వహించడం కుదరదు. దీంతో విశాఖ లేదా అనంతపురంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అనంతపురానికే అవకాశం ఇస్తున్న్టట్లుగా తెలుస్తోంది.