Begin typing your search above and press return to search.

పండగ చేసుకుంటున్న ఏపీ ఇంటర్‌ విద్యార్థులు

By:  Tupaki Desk   |   18 March 2015 11:46 AM GMT
పండగ చేసుకుంటున్న ఏపీ ఇంటర్‌ విద్యార్థులు
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. ఒకే సిలబస్‌తో రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షలు జరగడం ఇందుకు కారణం. ఒకే సిలబస్‌ అయినా అక్కడా ఇక్కడా విద్యార్థులే కదా పరీక్ష రాయాల్సింది? రాయకుండానే ఏమైనా పాస్‌ అవుతున్నారా అని ఆశ్చర్యపోకండి.

తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 9వ తేదీనుంచి, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి పది నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 11వ తేదీ నుంచి, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభమయ్యాయి. రెండు చోట్లా పరీక్షలకు ఒకే సిలబస్‌ ఉండటంతో పరీక్ష ముగియగానే తెలంగాణ విద్యార్థులు వాట్సప్‌, మెయిల్‌, తదితర విధానాల ద్వారా ఏపీలోని విద్యార్థులకు పంపిస్తున్నారు !!

మొత్తం సిలబస్‌ అంతా ఈ విధానంలో కవర్‌ అవకపోయినప్పటికీ దాదాపు 25-30 శాతం ప్రశ్నలు ఏపీలోనూ వస్తున్నట్లు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన బయాలజీలో ఇలా 16 ప్రశ్నలు, మ్యాథ్స్‌లో తొమ్మిది ప్రశ్నలు రిపీట్‌ అయినట్లు పేర్కొంటున్నారు. మొత్తంగా క్వశ్చన్‌ డైరెక్టుగా రాకపోయినా తెలంగాణలో అడిగిన ప్రశ్నతో దాదాపు సమానమైన విధంగానే అక్కడా ప్రశ్నలు రావడం ఆసక్తికరం.

ఈ అనుకోని అవకాశంతో ఏపీ విద్యార్థులు ఖుష్‌ అవుతున్నారు. ప్రశ్నల గురించి ముందుగా అవగాహన వచ్చేందుకు తెలంగాణ పరీక్షా పత్రం అవకాశం ఇస్తుండటంతో వారు ఆ మేరకు సిద్ధం అవుతున్నారు. మిగతా పరీక్షలు ఎపుడు జరుగుతాయో అంటూ ఎదురుచూస్తున్నారనటం అతిశయోక్తి కాదు!