Begin typing your search above and press return to search.

ఆంధ్రా పక్క రాష్ట్రమా...పక్కలో పొడి చేశావ్ మెగా బాస్!

By:  Tupaki Desk   |   12 Jan 2023 10:31 AM GMT
ఆంధ్రా పక్క రాష్ట్రమా...పక్కలో పొడి చేశావ్ మెగా బాస్!
X
ఏపీ పక్క రాష్ట్రం. ఆ రాష్ట్రం రాజకీయాలతో తనకు ఏ మాత్రం సంబంధంలేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. అంతే కాదు తాను ఓటు హక్కు కలిగి ఉన్న రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నా తనకు ఏపీ రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఆసక్తి అంతకంటే లేదు అని కుండబద్ధలు కొట్టేశారు.

ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఈ రకమైన సంచ్లన కామెంట్స్ చేశారు. నిజానికి మెగాస్టార్ ఎందుకు ఇల్లా మాట్లాడారు, ఆయన ఎందుకు ఇంతలా క్లారిటీగా చెప్పాల్సి వచ్చింది అన్నది తెలియదు కానీ పదే పదే తనకు రాజకీయాలతో ముడిపెడుతూంటే విసిగి ఆయన అలా చెప్పి ఉంటారని అంటున్నారు.

అయితే ఆ ఫ్లోలో చిరంజీవి ఏపీని తాను పుట్టిన రాష్ట్రాని పక్క రాష్ట్రం అంటూ అభిమానులు ప్రజల పక్కలో పొడిచేశారు అని అంటున్నారు. నిజానికి చిరంజీవికి ఏపీ అంటే విపరీతమైన మక్కువ. ఆయన విశాఖలో ఒక ఇల్లు కట్టుకుని రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను అని తాజాగా చెప్పారు. మరి ఆ మాట అలా జనం నోళ్లలో ఉండగానే ఇపుడు ఇలా ఏపీ పొరుగు రాష్ట్రం నాకేంటి సంబంధం అన్నట్లుగా మాట్లాడడం మీద ఫ్యాన్స్ సహా సగటు జనాలు హర్ట్ అవుతున్నారు.

అంటే చిరంజీవి ఏపీని ఏ కర్నాటక, తమిళనాడు కేరళల మాదిరిగా భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి నిఖార్సు అయిన పొరుగు రాష్ట్రాలు అంటే అవి అనుకోవాలి. కానీ చిరంజీవి ఏపీకి చెందిన వారు అయి ఉండి పొరుగు రాష్ట్రం అని మాట్లాడటం మీద మాత్రం వాడిగా వేడిగా చర్చ సాగుతోంది.

అంత పొరుగు రాష్ట్రం అయితే సినిమాల కలెక్షన్లకు మాత్రం పనికి వస్తుందా అని అన్న వారూ ఉన్నారు. ఏపీలోనే ఏ తెలుగు సినిమాకు అయినా ఎక్కువ కలెక్షన్లు వస్తాయ్. పైగా ఎంతలా టాలీవుడ్ తెలంగాణాలో సెటిల్ అయినా హీరోలు అంతా మావారే మా ఆంధ్రులే అని ఇక్కడ వారు భావిస్తారు.

కానీ మెగాస్టార్ మాత్రం ఏపీ రాజకీయాలతో పనేంటి అన్నంతవరకూ ఓకే కానీ ఏపీని పొరుగు రాష్ట్రంగా జమ చేయడం మాత్రం అసలు బాలేదు అని అంటున్నారు. ఇదేంటి మెగా బాసూ అని కూడా చికాకు పడుతున్నారు. ఇక పోతే మెగాస్టార్ మాటలు అయితే లాజిక్ కి అందకుండా ఉన్నాయని అంటున్నారు. విశాఖలో సెటిల్ అవుతాను అని మెగాస్టార్ అంటే దాని అర్ధమేంటి ఆయన ఏపీ వారుగానే ఉంటారు అనుకోవాలి కదా. మళ్లీ అంతలోనే ఏపీ పొరుగు రాష్ట్రం ఎలా అయిందో చెప్పండి సార్ అని అంటున్నారు.

ఇక తనకు రాజకీయాలు అంటే అసలు ఇష్టం లేదని, తాను వాటి గురించి పట్టించుకోనని, తన ఇంటికి పేపర్లు కూడా రావని చిరంజీవి చెప్పడం పట్ల కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎందుకు ఈ విధంగా మెగాస్టార్ మాట్లాడారు అన్నది ఎవరికీ తెలియకపోయినా ఆయన ఏపీని పక్క రాష్ట్రం అని అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పక్కలో బల్లెం గుచ్చేశారు అనే అంటున్నారు. మరి దీని మీద చిరంజీవి మరో మాట ఏమైనా చెబుతారా అని అంతా చూస్తున్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి ఎవరూ రమ్మని కోరకపోయినా ఏపీని మాత్రం పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం అని దూరం చేయవద్దు అనే అంతా కోరుకుంటున్నారు. మరి సున్నిత మనస్కుడు అయిన మెగాస్టార్ ఏపీ జనాలు తమ గుండెలలో పెట్టుకున్న చిరంజీవి ఏపీ నాకు పుట్టిన స్టేట్ అని అంటారని అది తొందరలో చెబుతారు అని అంతా ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.