Begin typing your search above and press return to search.

ఏపీ జర్నలిస్ట్ లకు అంత సీన్ ఉందా?

By:  Tupaki Desk   |   14 Aug 2016 5:30 PM GMT
ఏపీ జర్నలిస్ట్ లకు అంత సీన్ ఉందా?
X
ఎలా? అంటూ ప్రశ్న రావొచ్చు కానీ.. విషయం మొత్తం విన్నాక మేం వేసిన ప్రశ్నలో సమంజసంగా ఉందా? లేదా? అన్నది ఇట్టే అర్థమవుతుంది. ఈ విషయం గురించి మొత్తం అర్థం కావాలంటే కూసింత ఫ్లాష్ బ్యాక్ వెళ్లాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సమయంలో ఉద్యమకారులకు ధీటుగా.. తెలంగాణ మీడియా ప్రతినిధులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విపరీతంగా తపించారు. తన వృత్తి ధర్మానికి భిన్నంగా కొన్నిసార్లు.. కొంతమంది జర్నలిస్టులు అయితే.. తమ భావజాలానికి అనుగుణంగా కొంతమంది నేతల్ని ప్రశ్నల్ని సంధించి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేయటాన్ని మర్చిపోలేం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ఉద్యమం మలిదశలో అయితే.. జర్నలిస్టులు పోషించిన పాత్రం కీలకమైనది. ఏపీకి వచ్చే కేంద్ర స్థాయి నేతలు.. ప్రముఖులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టేందుకు సైతం భయపడే వారు. ఎవరొచ్చి ఏం అడుగుతారో ఊహించలేని పరిస్థితి. ఒక్క ఎయిర్ పోర్ట్ మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లినా వారికి ప్రజల నుంచి మాత్రమే కాదు.. తెలంగాణ జర్నలిస్టుల నుంచి కూడా ప్రశ్నలు అస్త్రాల మాదిరి దూసుకొచ్చేవి.

దీంతో.. వారు నోరు విప్పేందుకు సైతం ఇష్టపడే వారు కాదు. ఒకదశల బయట వారి సంగతి తర్వాత.. తెలంగాణ నేతలు సైతం తెలంగాణ జిల్లాల్లో పర్యటించటానికి సందేహించేవారు. ఇక.. కేంద్రమంత్రుల స్థాయి వారైతే.. ముందస్తుగా టీఆర్ఎస్ నేతలతో ఒక మాట మాట్లాడి ముందుకెళ్లే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ.. మీడియా రూపంలో వచ్చే ప్రశ్నలతో వారు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టుల్లో (అసెంబ్లీ బీట్ చూసే రిపోర్టర్లలో) ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉండేవారు. వారి ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు వీలుగా.. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన చిక్కు ప్రశ్నల్ని సంధించేవారు. కొందరు టీవీ ఛానళ్ల రిపోర్టర్లుఅయితే.. ఆంధ్రా నేతల దగ్గర మైకులు.. కెమేరాలు పెట్టి ప్రశ్న మీద ప్రశ్నలు సంధించేవారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. అదో బ్రేకింగ్ న్యూస్ అయిపోయేది. అధినేత దగ్గర నుంచి చీవాట్లు తినాల్సి వచ్చేది.

ఉద్యమం మలిదశలో.. హైదరాబాద్ కు వచ్చే ప్రతి సెలబ్రిటీ చేత ‘‘జై తెలంగాణ’’ నినాదం చేయాల్సిందిగా కోరేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటం వెనుక ఇలాంటి కోట్లాది ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే కేంద్రం.. తెలంగాణ అంశాన్ని పరిశీలించటం మొదలెట్టింది. ఇప్పుడు వంతు ఆంధ్రాది అయ్యింది. విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నా.. వారేమాత్రం అందుకు సానుకూలంగా లేరన్నది తెలిసిందే. అయితే.. వారిపై ఒత్తిడి తీసుకొచ్చి.. వారి చేత తప్పనిసరిగా హోదాను సంపూర్ణంగా అమలు చేయించుకోవాల్సిన గురుతర బాధ్యత ఏపీ నేతలు.. మీడియా ప్రతినిధుల మీద ఉందనటంలో సందేహం లేదు. పుష్కరాలు.. ఇతర ముఖ్య కార్యక్రమాలకు వచ్చే ఢిల్లీ స్థాయి నేతల్ని హోదా విషయంలో కేంద్రం ఇచ్చిన హామీల్ని.. మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేయటం.. సెంటిమెంట్ రగల్చటం లాంటివి చేస్తే తప్ప హోదా వ్యవహారంపై అడుగు ముందుకు పడదు. అందుకే అన్నది.. ఇదంతా చేసే సీన్ ఏపీ జర్నలిస్టులకు ఉందా అని? దీనికి సమాధానం కాలమే సరిగా చెప్పగలదు.