Begin typing your search above and press return to search.

జగన్ కు సూటి సవాలు విసిరిన ఆంధ్రజ్యోతి ఆర్కే

By:  Tupaki Desk   |   8 May 2022 4:10 AM GMT
జగన్ కు సూటి సవాలు విసిరిన ఆంధ్రజ్యోతి ఆర్కే
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణ. ఇటీవల కాలంలో దుష్టచతుష్టయం పేరుతో మీడియాలోని కొన్ని సంస్థల మీద మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయనకు.. ఇదంతా దేనికి తేల్చేసుకుందామా? అన్న రేంజ్ లో ఆయన సవాలు విసరటం సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని అదే పనిగా తప్పు పడుతున్న పచ్చ మీడియా సంస్థలంటూ నోరు పారేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్.. మీడియా మీద పడటం ఆపేసి.. డెవలప్ మెంట్ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడాలని ఆయన కోరుతున్నారు.

తాజాగా ఆయన రాసిన కాలమ్ లో పలు అంశాల్ని ప్రస్తావించారు. రాజకీయాల్ని.. ప్రజల్ని మీడియా ప్రభావితం చేయగలిగితే 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి ఆగిపోతుందని.. ఏపీ డెవలప్ మెంట్ మీద ప్రభావం పడుతుందని హెచ్చరించారని.. కానీ ఏపీ ప్రజలు మాత్రంజగన్ కు మొగ్గు చూపిన వైనాన్నిఆయన ప్రస్తావించారు. మీడియాలోని కొన్ని సంస్థలను అదే పనిగా నిందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తానో సూచన చేయదలిచినట్లుగా చెబుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల్ని ఆయన అక్షరాల్లోనే చదివితే..

‘‘రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ వలసపోయి బతకడమా? లేక రాష్ర్టాన్ని గాడిలో పెట్టడానికి సంఘటితం కావడమా? అన్నది ప్రజలు, మేధావులే తేల్చుకోవాలి. మీడియాను నిందిస్తున్న జగన్‌ రెడ్డికి ఒక సూచన! ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంటే, మేం అడ్డుపడుతున్నామని అంటున్నారు కదా.. ఒక పనిచేద్దాం! మేం తప్పు చేస్తున్నామా? ప్రభుత్వం వైఫల్యం చెందిందా? అన్నది తేల్చుకోవడానికి జగన్‌ రెడ్డితో ‘ఏబీఎన్‌’ వేదికగా చర్చ నిర్వహించడానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి కూడా సిద్ధపడితే ఎవరేమిటో తేలిపోతుంది. ఇందుకు సిద్ధపడని పక్షంలో మీడియా మీద పడి ఏడవటం అయినా ఆపి మంచి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. బలహీనుడే తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరులపై నింద వేయడం సర్వ సహజమంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు సహజంగానే కోపం తెప్పించేవిగా ఉంటాయని చెప్పక తప్పదు. సీఎంగా జగన్ రెడ్డి ఇతర రాష్ట్రాల సీఎంల పనితీరుతో పోటీ పడాలే కానీ మీడియాతో కాదన్నఆయన.. ‘‘అలా చేయకుండా ఎవరో ఒకరిని నిందిస్తూ పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి, నేటికి జగన్‌ రెడ్డి ముఖంలో వచ్చిన మార్పులు ఆయనలోని ఆందోళనకు అద్దం పడుతున్నాయి. అధికారం పోతుందన్న ఆందోళన ఆయనదైతే, రాష్ట్రం నాశనం అవుతున్నదన్న ఆందోళన మాది. ఇదే తేడా’’ అంటూ జగన్ తో తనకున్న పంచాయితీ ఏమిటన్న విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు. మరి.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఇచ్చిన ఆఫర్ కు సీఎం జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.