Begin typing your search above and press return to search.

ఆంధ్రా కేసీయార్... తెలంగాణా చంద్రబాబు

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:30 PM GMT
ఆంధ్రా కేసీయార్... తెలంగాణా చంద్రబాబు
X
అటు ఇటు అవుతుంది. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి. కాలం ఎపుడూ ఒకే తీరుగా ఉండదు. తెలంగాణా ఉద్యమంతో ఆంధ్రా పార్టీలను తూలనాడి దూరం పెట్టిన కేసీయార్ బీయారెస్ తో ఇపుడు తెలంగాణాలో ఆంధ్రా పార్టీలకు ఏకంగా గేట్లే తెరిచారు. తెలంగాణాలో పుట్టి అక్కడే ఎదిగి ఉమ్మడి ఏపీలో అత్యధిక ఓటు షేర్ తెలంగాణాలో కలిగిన తెలుగుదేశం టీయారెస్ రాజకీయానికి దారుణంగా బలి అయిపోయింది.

ఒక ఉప ప్రాంతీయ పార్టీగా మారి కేరాఫ్ అంధ్రా అయిపోయింది. ఎనిమిదేళ్ళ కాలమంతా ఏపీకే పరిమితం అయిన చంద్రబాబుకు ఇపుడు కేసీయార్ జాతీయ పార్టీ ఆలోచనలు మళ్ళీ తెలంగాణాలో కాలూనుకునేలా చేశాయి. దాంతో బాబు ఇపుడు తెలంగాణా మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ని రంగంలోకి దించి తన పార్టీ తెలంగాణా శాఖ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చారు. కాసానితో ఇపుడు తెలంగాణా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతే కాదు ఒకనాడు టీడీపీలో ఉంటూ తరువాత రోజుల్లో మారిన రాజకీయంతో వీడివెళ్ళిన సీనియర్ నాయకులను కూడా తెలంగాణా టీడీపీలో చేర్చుకునేందుకు బాబు వ్యూహ రచన చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయం ఇపుడు పూర్తిగా జోరందుకుంది. తెలంగాణాలో బస్తీ మే సవాల్ అంటున్నారు. అక్కడ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి బాబు చూస్తున్నారు.

ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో జరిగే భారీ సభకు బాబు హాజరు అవుతున్నారు.ఈ సభ ద్వారా బాబు తెలంగాణాలో టీడీపీ ఏం చేయబోతోంది అన్నది చెబుతారు అని అంటున్నారు. అదే టైం లో ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటీచేయడానికి తెలుగుదేశానికి సరికొత్త మార్గం ఏర్పడింది. ఈక్ చూస్తే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. దాంతో అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టిగా సౌండ్ చేస్తే ఏపీలో కూడా ఆ ప్రభావం రాజకీయంగా బలంగా వినిపిస్తంది అని అంటున్నారు. అది ఏపీ ఎన్నికల్లో కూడా అడ్వాంటేజి గా మారుతుంది అని బాబు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో బలమున్న చోట గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టి తెలంగాణాలో సత్తా చాటాలని బాబు చూస్తున్నారు. కేసీయార్ బీయారెస్ అంటూ రాజకీయ ప్రయోగం చేయడం కాదు కానీ బాబుకు మహా బాగా కలసి వచ్చింది అని అంటున్నారు. ఇపుడు ఆంధ్రా పార్టీ అని కూడా ఎక్కడా కేసీయార్ అనలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కేసీయార్ కూడా ఏపీ మీద కన్నేశారు. బీయారెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించుకోవడానికి కేసీయార్ కి ఏపీ అనువైన ప్రదేశంగా ఉంది.

దాంతో ఆయన తన తరఫున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని ఏపీలో ఇంచార్జిగా ఉంచి కధ నడిపిస్తున్నారు. ఏపీ టీడీపీ లీడర్స్ తో తలసానికి మంచి పరిచయాలు ఉన్నాయి. అదే టైం లో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడుతో ఏకంగా బంధుత్వం కూడా ఉంది. దాన్ని వినియోగించుకుని ఏపీలో బీయారెస్ ని బలోపేతం చేయడానికి తలసాని చూస్తున్నారు అని అంటున్నారు.

బీయారెస్ పార్టీ ఆఫీసుని కూడా విజయవాడకు సమీపంలోని జక్కంపూడిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ పార్టీ నిర్మాణం పనులు మొత్తం తలసారి శ్రీనివాసయాదవ్ ఆద్వర్యంలోనే జరుగుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే కేసీయార్ బీయారెస్ ని ఏర్పాటు చేశారు కానీ ఏపీలో ఆయనకు వచ్చే ఓట్లు ఎన్ని ఏపీ జనాల ఆదరణ ఎంత అంటే జవాబు మాత్రం కష్టం. ఎందుకంటే ఉమ్మడి ఏపీని విడదీసిన పార్టీగా కేసీయార్ కి ఏపీలో ఒక ముద్ర ఉంది.

దాంతో ఆయన ఏపీ జనాల మనసు గెలుచుకోగలరా అన్నది చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబుకు మాత్రం తెలంగాణాలో దూసుకుపోవడానికి ఏ రకమైన ఇబ్బందులూ లేవు. మొత్తానికి చూస్తే బాబుకు అలా కేసీయార్ లైన్ క్లియర్ చేశారని అంటున్నారు. అదే టైం లో ఆంధ్రా కేసీయార్ గా తాను కనిపించాలని గులాబీ బాస్ తహతహలాడుతుంటే తెలంగాణా చంద్రబాబు కావాలని టీడీపీ అధినేత ఆరాటపడుతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు చంద్రుల రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.