Begin typing your search above and press return to search.

చేతకాని ఆంధ్రోళ్లు.. చూసైనా నేర్చుకుంటారా?

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:33 AM GMT
చేతకాని ఆంధ్రోళ్లు.. చూసైనా నేర్చుకుంటారా?
X
చేతకానిది ఏదైనా చూసైనా నేర్చుకోవాలంటారా? తమకు తాము తెలివితేటలకు నిదర్శనంగా.. తమకు మించిన మొనగాళ్లుగా చెప్పుకోవటంతోపాటు.. నాగరికతకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకుంటూ.. చదువు సంధ్యలతో పాటు.. సామాజిక చైతన్యం కూడా తమలో ఎక్కువని చెప్పుకునే ఆంధ్రులకు అంత సీన్ ఉందా?

నిత్యం తమను తాము పొగుడుకోవటానికి.. తమ గొప్పలు చెప్పుకోవటానికే సమయం సరిపోదన్నట్లుగా వ్యవహరించే వారి మాటలకు.. చేతలకు మధ్య వ్యత్యాసం ఇప్పుడిప్పుడే లోకానికి తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఆంధ్రోళ్లతో పంచాయితీ అంత తేలిగ్గా తేలేది కాదంటూ టీఆర్ ఎస్ అధిపతి కేసీఆర్ చేస్తుంటే.. వామ్మో.. ఆంధ్రోళ్లతో అంత కష్టమా? అనుకునేవారు.

ఆంధ్రోళ్లు అంటేనే కిరికిరి అనే మాటల్ని చూసి.. వామ్మో వారితో విషయం ఏదైనా కష్టమే సుమి అని బెదిరినట్లుగా చెప్పేవారు. ఆంధ్రోళ్లు కానీ తలుచుకుంటే భూమిని.. ఆకాశాన్ని ఏకం చేసేస్తారని.. వారి ప్రజాప్రతినిధులు ఒక్కసరి సీన్లోకి వస్తే.. మొత్తం సమీకరణలే మారిపోతాయన్న ప్రచారం భారీగా సాగేది. ఇదంతా చేసిన ఆంధ్రోళ్లకు ఒంటి మీద గుడ్డ నిలిచేది కాదు. తమ నేతల్ని చూసి వారు మురిసిపోయేవారు. వారి మాటల్ని విని ఎంతో సంతసించేవారు.

తమకు తాము బలవంతులుగా అనుకునే ఆంధ్రోళ్లు.. తమకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు సైతం అత్యంత శక్తివంతులని నమ్మేవారు. కానీ.. వారి శక్తి.. చివరకు సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కు కూడా నోచుకోదన్న విషయం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఈ రోజు ఖ్యాతి గడించిందంటే.. దాని గొప్పతనం తెలంగాణ నాయకుల కంటే కూడా ఆంధ్రానేతల చేతకానితనమే ఎక్కువ.

ఇప్పటికే కాంగ్రెస్ పల్లకిని మోసే ఆంధ్రా నాయకులు.. తమ అధినేత్రి పట్ల అంతులేని అభిమానాన్ని ప్రదర్శిస్తారు. ఇక.. ఆంద్రోళ్లకు న్యాయం చేసేందుకే తాను ఉన్నానని.. తన శేష జీవితం మొత్తం వారి కోసమే అంటూ బడాయి మాటలు చెప్పి అధికారలోకి వచ్చిన చంద్రబాబు నోటి నుంచి ఇప్పుడు మాట రాని పరిస్థితి. అడ్డదిడ్డంగా విభజన చేసేసి.. బర్త్ డే కేక్ కోసినంత ఈజీగా తెలుగు రాష్ట్రాల్ని ముక్కలుగా చేసేసిన కాంగ్రెస్ అధినాయకత్వానికి తానా అంటే తందానా అన్నట్లుగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తలూపారు.

ఇప్పుడు మిత్రధర్మం అంటూ.. మోడీ సర్కారు ఏం చేసినా నోరు మెదపకుండా ఉండిపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విభజన బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడిన వెంకయ్యనాయుడు.. ఇప్పుడు కేంద్రమంత్రి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సరిదిద్దుతామని చెప్పారు. అవన్నీ ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చేది లేదంటూ.. కనీసం ఆ ఆలోచన కూడా లేదని కేంద్రం మరోసారి కుండ బద్ధలు కొట్టేసింది.

ఇంత జరుగుతున్నా ఏపీ నాయకులు.. ఏపీ ప్రజలు చూస్తూ ఉండిపోతున్నారు తప్పించి పోరాడటం లేదు. మేం చేస్తే ఏమవుతుందని చాలామంది నేతలు మాటలు చెబుతుంటారు. ఇలాంటి మాటనే పదమూడేళ్ల కిందట కేసీఆర్ అనుకొని ఉంటే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ఆర్థికంగా బలోపేతం అయినప్పటికీ.. తమ డిమాండ్ల విషయంలో.. తమ ప్రాంతానికి లాభం చేకూరే ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా పోరాడుతున్న గుణం తెలంగాణ అధికారపక్షం నేతల్లో కనిపిస్తుంది.

ఇదే స్ఫూర్తిని ఏపీ నేతలు ఎందుకు పాటించరు. తెలంగాణ నేతలు దద్దమ్మల్లా ఉన్నారని భావించినప్పుడు వారిని కార్యోన్ముఖులుగా చేయటంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషించారు. చేతకాని వారిగా మిగిలిపోతున్న ఏపీ నేతలకు చురుకు పుట్టేలా ఏపీ ప్రజలు వ్యవహరించాల్సి ఉంటుంది. అదెలా అన్న సందేహం మనసులోకి వస్తే.. పక్కనున్న తెలంగాణ ప్రజల్ని చూసి నేర్చుకున్నా సరిపోతుంది.