Begin typing your search above and press return to search.

సెలెక్ట్‌ కమిటీకి బ్రేక్ వేసిన శాసనమండలి కార్యాలయం!

By:  Tupaki Desk   |   10 Feb 2020 11:20 AM GMT
సెలెక్ట్‌ కమిటీకి బ్రేక్ వేసిన శాసనమండలి కార్యాలయం!
X
ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ - సీఆర్డీయే రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో.. సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్‌ కు టీడీపీ - బీజేపీ - పీడీఎఫ్ పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని - ఇది రాజ్యాంగ విరుద్ధమని - ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు. అయితే, తాజాగా ఈ సెలెక్ట్‌ కమిటీ ఫైల్‌ ని శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానసమండలి చైర్మన్‌ వద్దకు ఈ సెలెక్ట్ కమిటీ ఫైలు చేరింది.

రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ వ్యవహారం పై శాసనమండలి కార్యదర్శిని టీడీపీ - బీజేపీ - పీడీఎఫ్‌ పక్షాలు కలిశాయి. రూల్‌ 154 కింద చైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. అయితే , మండలి చైర్మన్‌ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు.

అయితే, సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపడంతో ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న - నాగజగదీష్ - అశోక్ బాబు - బచ్చుల అర్జునుడు తదితరులు కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు.