Begin typing your search above and press return to search.

ఏపీ స్థానికత ఎలా వస్తుందో తెలుసా?

By:  Tupaki Desk   |   21 Jun 2016 5:42 AM GMT
ఏపీ స్థానికత ఎలా వస్తుందో తెలుసా?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ తో సహా.. తెలంగాణలోని ఏ ప్రాంతంలో అయినా ఉన్న ఏపీ వారు.. తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్లేందుకు వీలుగా స్థానికత అంశాన్ని తెర మీదకు తీసుకురావటం.. దీనికి సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశానికి సంబంధించిన మార్గదర్శకాల్ని అధికారులు సిద్ధం చేశారు. త్వరలో విడుదలయ్యే ఈ మార్గదర్శకాలు ఎలా ఉంటాయన్నఅంశాన్న చూసినప్పుడు.. ఏపీకి వెళ్లే వారికి మాత్రమే స్థానికత లభిస్తుంది తప్పించి.. వారి కుటుంబానికి కాదు.

అదే సమయంలో.. ఏపీలో స్థిర నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపించిన తర్వాతే స్థానికత లభించనుంది. ఉదాహరణకు హైదరాబాద్ లోని ఏపీ సచివాలయలో పని చేస్తున్న ఉద్యోగి అమరావతికి వెళ్లిన పక్షంలో.. సదరు వ్యక్తికి ఏపీ స్థానికత వస్తుంది. కానీ.. వారి కుటుంబానికి మాత్రం ఏపీ స్థానికత రాదు. ఒకవేళ.. ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్ విడిచిపెట్టి.. ఏపీలో సొంతిల్లు లేదంటే అద్దె ఇంట్లో నివాసం ఉంటే.. వారికి ఏపీ స్థానికత లభించనుంది. అయితే.. ఇదంతా 2017 జూన్ 2 లోపు జరగాలి.

అంతేకాదు.. ఇలా ఏపీకి వచ్చిన వ్యక్తి.. తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన ఆధారాలతో.. స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని పరిశీలించి.. అక్కడ నివాసిగా ఉంటున్నట్లగా గుర్తిస్తే.. వారికి స్థానికత సర్టిఫికేట్ అందజేస్తారు. ఏపీస్థానికత రావాలంటే.. ఏపీలో నివాసం ఉంటున్న ఆధారాలు తప్పనిసరి.