Begin typing your search above and press return to search.

పోరాటాల పురిటిగ‌డ్డే..హోదా అర్జున‌రావు అడ్డా!

By:  Tupaki Desk   |   12 Feb 2019 5:55 AM GMT
పోరాటాల పురిటిగ‌డ్డే..హోదా అర్జున‌రావు అడ్డా!
X
తెలుగు నేల మీద చైత‌న్య‌వంత‌మైన గ‌డ్డ ఏద‌న్న వెంట‌నే.. ఎవ‌రికి వారు త‌మ ప్రాంతాన్ని ఏదో పాయింట్లో గొప్ప‌గా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. నిజాయితీగా.. ఎలాంటి భావోద్వేగాల‌కు గురి కాకుండా చెప్పాలంటే సిక్కోలును ఉద్య‌మ గ‌డ్డ‌గా చెప్పాలి. తెలుగు నేల మీద భారీ ఉద్య‌మం పురుడు పోసుకున్నా.. త‌ర్వాతి కాలంలో కోట్లాది మందిని క‌దిలించిన ఉద్య‌మాల పురిటిగ‌డ్డ సిక్కోలుగా చెబుతుంటారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక‌హోదాను.. మోడీ మాష్టారి తొండాట కార‌ణంగా ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి చెందిన ప‌లువురు నేత‌లు హోదా కోసం నిర‌స‌న‌లు.. దీక్ష‌లు చేసినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో చేస్తున్న హోదా దీక్ష నేప‌థ్యంలో పురుగుల మందు తాగి ప్రాణ‌త్యాగం చేసిన సిక్కోలు వాసి అర్జున‌రావు ఇప్పుడు అంద‌రిని క‌దిలిస్తున్నారు.

ఇంత‌కీ అర్జున రావు ఎవ‌రు? ఏం చేస్తుంటారు? హోదా కోసం అత‌గాడి ఆరాటం ఏమిటి? లాంటి ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు వెతికితే..

శ్రీ‌కాకుళం జిల్లా పొందూరు మండ‌లం కింత‌లికి చెందిన దివ్యాంగుడు అర్జున‌రావు. విభ‌జ‌న త‌ర్వాతి నుంచి ప్ర‌త్యేక హోదాతో ఏపీకి జ‌రిగే మేలు గురించి అదే ప‌నిగా మాట్లాడుతుండేవాడు. ఎక్క‌డికి వెళ్లినా హోదా ప్ర‌స్తావ‌న తెస్తూనే ఉండేవాడు. దివ్యాంగుడే అయినా.. హోదా సాధ‌న కోసం ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించేవాడు. హోదా కోసం త‌పించ‌ట‌మే కాదు.. హోదా వ‌స్తే ఏపీ రూపురేఖ‌లు ఎంత‌లా మార‌తాయ‌న్న విష‌యంతో పాటు.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం విప‌రీతంగా ఆరాట‌ప‌డేవాడు.

తాజాగా బాబు చేస్తున్న ఢిల్లీ దీక్ష‌కు సైతం త‌న సొంత ఖ‌ర్చుతో వ‌చ్చిన ఆయ‌న‌.. పురుగులుమందు తాగి మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త విన్నంత‌నే ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. హోదా కోసం బ‌లిదానం చేయ‌టం ప‌లువురిని క‌దిలించి వేసింది.

ఓప‌క్క వైక‌ల్యం.. మ‌రోప‌క్క ఆర్థిక ప‌రిస్థితులు.. ఇంకోప‌క్క ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ అర్జున‌రావు మాత్రం హోదా సాధ‌న కోసం త‌పించేవాడు.త‌న తోటి వారిని చైత‌న్య‌ప‌రుస్తూ.. ఉద్య‌మ బాట న‌డవ‌టం ఆయ‌న చేసేవారు. ఇంట్లో నాలుగో సంతాన‌మైన ఆయ‌న ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దివారు.

2002లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌డుం దెబ్బ తిన‌టంతో రెండు కాళ్లు చ‌చ్చుబ‌డిపోయాయి. అయిన‌ప్ప‌టికీ చ‌క్రాల బండి మీద తిరుగుతూ హోదా సాధ‌నం కోసం ప్ర‌య‌త్నించేవారు. అవినీతి.. అక్ర‌మాల మీద పోరాటం సాగించే అర్జున రావు.. గ్రామ‌.. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాలు చేప‌ట్టేవారు. లోక్ పాల్ బిల్లు తేవాలంటూ అప్ప‌ట్లో అన్నా హ‌జారే చేసిన దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఢిల్లీకి వెళ్లి పాల్గొన్న ఘ‌న‌త అర్జున రావు సొంతం . హోదా సాధ‌న కోసం బ‌లిదానం చేయ‌టం సిక్కోలు జిల్లాతో పాటు.. ఆంధ్రోళ్లను విషాదంలో నింపేసింది.