Begin typing your search above and press return to search.

హోదా సాధ‌న కోసం ఢిల్లీలో ఆంధ్రోడి ప్రాణ‌త్యాగం!

By:  Tupaki Desk   |   12 Feb 2019 3:49 AM GMT
హోదా సాధ‌న కోసం ఢిల్లీలో ఆంధ్రోడి ప్రాణ‌త్యాగం!
X
కేంద్రం కుయుక్తుల కార‌ణంగా మ‌రో నిండు ప్రాణం బ‌లిదానం చేసుకునేలా చేసింది. తెలంగాణ సాధ‌న కోసం అప్ప‌ట్లో ప‌లువురు తెలంగాణ వాదులు ప్రాణ‌త్యాగం చేయ‌టం తెలిసిందే. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన అన్యాయంతో ఆవేద‌న చెందిన ఒక‌రు.. తాజాగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ఏపీలో విషాదాన్ని నింపింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న హోదా దీక్ష ప్రారంభానికి అర‌గంట ముందు.. పురుగులు మందు తాగిన శ్రీ‌కాకుళం యువ‌కుడు ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ప‌లువురిని క‌లిచివేసింది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే.. దీక్ష శిబిరం మ‌ధ్య‌లోనే చంద్ర‌బాబు ఒక ప్ర‌క‌ట‌న చేయ‌టంతోపాటు.. ఇలాంటి ఆత్మ‌హ‌త్య‌లు ఎవ‌రూ చేసుకోవ‌ద్దంటూ అభ్య‌ర్థించారు.

శ్రీ‌కాకుళం జిల్లా పొందూరు మండ‌లం కింత‌లికి చెందిన 40 ఏళ్ల అర్జున‌రావు హోదా కోసం బ‌లిదానం చేశారు. దివ్యాంగుడైన ఆయ‌న‌.. విభ‌జ‌న త‌ర్వాత నుంచి హోదా కోసం త‌పించేవారు. హోదాతోనే ఏపీకి అంతో ఇంతో మేలు జ‌రుగుతుంద‌ని.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన భారీ న‌ష్టానికి హోదా అంతో ఇంతో భ‌ర్తీ చేస్తుంద‌న్న ఆశ‌ను వ్య‌క్తం చేసేవారు. ఢిల్లీలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దీక్ష చేస్తున్న వేళ‌.. సొంత ఖ‌ర్చుల‌తో ఢిల్లీకి వ‌చ్చిన అర్జున రావు.. ఏపీ భ‌వ‌న్ బ‌య‌ట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఏపీకి హోదా కోస‌మే తానీ బ‌లిదానానికి పాల్ప‌డుతున్న‌ట్లుగా పేర్కొన్న అర్జునరావు భౌతిక‌కాయాన్ని ఢిల్లీ పోలీసులు హ‌డావుడిగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న తెలుగులో రాసిన సూసైడ్ లెట‌ర్ నుబ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. అర్జున రావు మృత‌దేహాన్ని ఎక్క‌డ‌కు త‌ర‌లించార‌న్న విష‌యాన్ని ఢిల్లీ పోలీసులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ వెల్ల‌డించ‌లేదు. తీవ్ర ఒత్తిడి అనంత‌రం రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రిలో ఉంచిన‌ట్లుగా తెలియ‌జేశారు.

అర్జున‌రావు త్యాగాన్ని ప్ర‌క‌టించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. అర్జున‌రావు ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. అర్జున‌రావు సూసైడ్ లెట‌ర్ ను ఢిల్లీ పోలీసులు బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌టంపై టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అర్జున‌రావు కుటుంబానికి ఏపీ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.

అదే స‌మ‌యంలో ఇలాంటి త్యాగాలు వ‌ద్ద‌ని.. ఎవ‌రూ అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పోరాడి హోదాను సాధించుకుందామ‌ని బాబు పిలుపునిచ్చారు. ఏమైనా త‌న జాతి ప్ర‌యోజ‌నాల కోసం.. భ‌విష్య‌త్ త‌రాలు బాగుండాల‌న్న త‌ప‌న‌తో త‌నువు చాలించిన అర్జున‌రావు మ‌ర‌ణం హోదా సాధ‌న పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేయ‌ట‌మే కాదు.. ఆంధ్రోళ్ల‌లో ప‌ట్టుద‌ల‌ను మ‌రింత పెంచుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.