Begin typing your search above and press return to search.

ముగ్గురు మంత్రుల ముందుచూపు లోపం

By:  Tupaki Desk   |   1 Feb 2016 7:04 AM GMT
ముగ్గురు మంత్రుల ముందుచూపు లోపం
X
ముద్రగడ పద్మనాభం సీనియర్ నాయకుడు.. ఒకసారి ఎంపీ - నాలుగుసార్లు ఎమ్మెల్యే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయంగా ఆయన అవుట్ డేటెడ్ లీడర్ గా అనిపించినా కులం పరంగా అప్ డేటెడ్ లీడరే. అందులో తిరుగులేదు. అయినా ప్రభుత్వం ఆయన్ను తేలిగ్గా తీసుకోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముద్రగడ పద్మనాభం జిల్లాకే చెందిన, అదే కులానికి చెందిన చినరాజప్ప రాష్ట్రానికి హోం మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.... ఇద్దరూ చాలాకాలం ఒకే పార్టీలో ఉన్నారు. ముద్రగడ గురించి చినరాజప్పతో పాటు టీడీపీలోని చాలామంది నేతలకు బాగా తెలుసు. మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితోనూ ఆయన కలిసి పనిచేశారు. ఆ ప్రాంతానికే చెందిన యనమలకు కూడా ముద్రగడ నైజం తెలిసిందే. అందరూ ఉన్నా కూడా ముద్రగడ అనూహ్య ఎత్తుగడలకు రాష్ట్రంలోని శాంతిభద్రతలను బలిచ్చారు.

ముద్రగడ 1978లో తొలిసారి జనతాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 1982లో టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1983, 85 ఎన్నికల్లో గెలిచిన ఆయన ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే... హఠాత్తుగా మంత్రి పదవికి రాజీనామా చేసి కేఈ కృష్ణమూర్తి, జానారెడ్డిలతో కలిసి తెలుగునాడు పార్టీని ఏర్పాటుచేశారు. ఆ తరువాత 1988 ఎన్నికల సమయంలో ఏపీ పర్యటనకు వచ్చిన రాజీవ్ గాంధీకి ప్రత్తిపాడులో భారీ ఎత్తున స్వాగతం పలికి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకున్నారు.

అనంతరం 1994లో ఆయన ఓడిపోయి మళ్లీ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని ప్రతిన పూనారు. అనంతరం కొద్ది రోజులు కాపునాడు రాజకీయాలు నెరిపారు... కొద్దికాలం బీజేపీతో సన్నిహితంగా ఉండి కాకినాడ ఎంపీగా కృష్ణంరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన ఆరెస్సెస్ సమావేశాలకూ హాజరయ్యేవారు. అనంతరం మళ్లీ టీడీపీలో చేరి 1999లో కాకినాడ ఎంపీగా గెలిచారు. 2004లో అక్కడ ఓడిపోయారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ లో చేరి 2009 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి ఓదార్పు యాత్రలోనూ పాల్గొన్నారు.

ముద్రగడ పద్మనాభం గురించి తెలిసినవారు ఆయన వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెబుతారు. హింసాత్మకమైన నాయకుడు కానప్పటికీ సొంత అజెండా అమలు చేసే నాయకుడని చెబుతారు. ఆయనకు మొదటి నుంచి ఒక లక్షణం ఉంది. తొలి నుంచి కాపు నేతగా పాపులర్ అయిన ఆయనకు ఉద్యమ సమయంలో తన వ్యూహాన్ని ఎవరితో పంచుకునే అలవాటు లేదు. కనీసం ఆంతరంగికులతో కూడా మాట్లాడరు.

గతంలో 2005లో తొమ్మిది రోజుల పాటు తన ఇంట్లో స్వీయగృహ నిర్బంధం చేసుకుని తుపాకులు సిద్ధంగా ఉంచుకుని ఆయన హడావుడి చేశారు. అప్పట్లోనూ అది రచ్చరచ్చగా మారింది. తాజాగా కాపు గర్జన నిర్వహణలో కూడా తన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోలేదు. రైల్ రోకో, రాస్తారోకోకు పిలుపునిచ్చి, ప్రభుత్వాన్నే కాదు, తోటి కాపు నేతలనూ ఆయన ఆశ్చర్యపరిచారు. అయితే... ముద్రగడ నేపథ్యం తెలిసిన చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి ప్రభుత్వంలోని కీలక నేతలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని గుర్తించి ఉంటే బాగుండేది. హోం మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం వైఫల్యంగానే కనిపిస్తోంది.