Begin typing your search above and press return to search.

ఆ విషయానికి ఏపీ పేరు వాడాలా హరీశ్

By:  Tupaki Desk   |   21 Sep 2015 5:30 PM GMT
ఆ విషయానికి ఏపీ పేరు వాడాలా హరీశ్
X
తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ ల మధ్య చక్కటి సంబంధాలు లేవన్నది నిజమే. అయితే.. ప్రతి విషయంలోనూ ఏదో ఒక పోలిక తీసుకురావటం ఈ మధ్య తెలంగాణ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా ఏపీ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయటం తెలంగాణ నేతలకు సరికాదన్న వాదనను ఏపీ అధికారపక్షం నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి దారిన వారు బతుకుతున్నప్పుడు.. ఏదో వంకన తమ గురించి మాట్లాడటం.. విమర్శించటం సరైన చర్యకాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏపీలో మాదిరి పరిమితంగా నిర్వహించమని వ్యాఖ్యానిస్తున్నారని.. ఎవరి సౌలభ్యాన్ని అనుసరించి వారు నిర్వహించుకోవచ్చని.. దీనికి కూడా విమర్శించాల్సిన అవసరం ఏమిటన్నది వారి వాదన.

అసెంబ్లీ సమావేశాలు ఎంతకాలం నిర్వహించాలన్నది కూడా తెలంగాణ అధికారపక్షం నేతలు చెప్పినట్లే వినాలా? లేక వారి సలహా తీసుకోవాలాని అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎంతకాలం జరగాలన్న దానిపై తామేమీ మాట్లాడనప్పడు.. తమ గురించి ఏదో విధంగా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమిటన్నది ఏపీ అధికారపక్ష నేతల వాదన.

తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పిన మంత్రి హరీశ్.. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాల మీద చర్చిస్తామని వెల్లడించారు. రైతుల ఆత్మహత్యల మీద విపక్షాలకు మాట్లాడే హక్కు లేదని.. సభలో గొడవ చేస్తామంటే ఒప్పుకోమని ఆయన చెప్పారు. మంగళవారం నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగతాయన్న విషయాన్న మంత్రి హరీశ్ తన తాజా వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పిసినట్లు ఉందన్న వాదన వినిపిస్తోంది.