Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులు, ఎంపీల‌కు కొత్త నిర‌స‌న‌

By:  Tupaki Desk   |   29 Oct 2016 10:15 AM GMT
ఏపీ మంత్రులు, ఎంపీల‌కు కొత్త నిర‌స‌న‌
X
కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో బందరు పోర్టు నిర్మాణానికి జరుగుతున్న స‌న్నాహాలు ఒక‌వైపు ఊపందుకుంటుండ‌గా...మ‌రోవైపు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో కొత్త ఆందోళ‌న మొద‌లైంది. పోర్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే పరిహారం ఎంతనేది నిర్ణయించకుండా భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుండటంతో రాష్ట్ర బీసీ సంక్షేమ - చేనేత - ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర - పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణరావు ఒకింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. రైతుల్లో వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించేందుకు మంత్రి - ఎంపీ స‌హా అటు ప్రజాప్రతినిధులు - ఇటు అధికారులు సుముఖత చూపడం లేదు.

రెండు వేల ఎకరాల్లో పోర్టు నిర్మిస్తే సరిపోతుందంటూ అధికారంలోకి రాకముందు ఆందోళనల్లో పాలుపంచుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు అధికారం చేతికొచ్చిన తర్వాత పెద్దఎత్తున భూసేకరణకు పాల్పడటాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమలకు భూములిచ్చేది లేదంటూ అడ్డం తిరిగారు. దీంతో ప్రభుత్వం అభ్యంతరాలు (ఫారం-2) - అంగీకారాలు (ఫారం-3)ల ద్వారా రైతుల మనోభావాలను వారం రోజుల్లో తెలియజేయాలంటూ అధికారులను రంగంలోకి దించింది. దీనికి రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వటం - పట్టుమని పాతిక మంది కూడా అంగీకారం తెలపకపోవటంతో ఈ నెలాఖరు వరకు గడువును పెంచారు. అఖిల పక్షం గొడుగు కింద విపక్షాలు పాదయాత్రలకు సంసిద్ధమ‌వుతుండటం అధికారపార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. బంద‌రు పోర్టు నిర్మాణం విష‌యంలో రైతుల్లో అవగాహన కల్పించి భూములను సమీకరిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదు. పరిశ్రమలకు భూములిచ్చేది లేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. మరోపక్క అఖిలపక్షం గొడుగు కింద విపక్షాలు పాదయాత్రలకు సంసిద్ధమ‌వుతుండటం అధికారపార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌తో మంత్రి - ఎంపీ ఆందోళన చెందుతున్నారు. భూసమీకరణకు తొలుత పది మంది డిప్యూటీ కలెక్టర్లను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత తెలుగు తమ్ముళతో జరిపిన రాయబారాలు బెడిసికొట్టాయి.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 10,717 మంది రైతుల చేతుల్లో 14,620 ఎకరాల పట్టాభూమి ఉంది. అయితే వీరిలో కేవలం 135 మంది రైతులు 331 ఎకరాలు మాత్రమే ఇవ్వటానికి ముందుకు రావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అసైన్డ్ భూమి 9,117 ఎకరాలు 5,556 మంది చేతుల్లో ఉండగా కేవలం 64 మంది మాత్రమే 200 ఎకరాలకు అంగీకార పత్రాలు ఇవ్వటం - 9440 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఇద్దరు అనుభవదారులు మాత్రమే 5.29 సెంట్లు ఇవ్వటానికి ముందుకు రావటంతో అయోమయంలో పడ్డారు. బందరు పోర్టుకు భూములు ఇవ్వటానికి రైతులు ముందుకొచ్చినప్పటికీ పోర్టు - పరిశ్రమల నడవాకు ఒకేసారి భూములు ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వం 33,600 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వటంతో రైతులు ఆగ్రహిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/