Begin typing your search above and press return to search.

మంత్రుల్లో కొత్త భ‌యం మొద‌లైంది

By:  Tupaki Desk   |   10 Sep 2016 7:50 AM GMT
మంత్రుల్లో కొత్త భ‌యం మొద‌లైంది
X
ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా అంశం ఆంధ్రుల‌ సెంటిమెంట్‌ గా స్ధిరపడిపోయిన ప‌రిస్థితులు ఒక‌వైపు...కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీతోనే స‌రిపుచ్చుతూ హోదాపై మొండిచేయి చూపుతున్న తీరు మ‌రోవైపు... అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ‌ను టార్గెట్ చేస్తూ ఏపీలో రోడ్డెక్కుతున్న తీరుతో తెలుగుదేశం నాయ‌కుల్లో క‌ల‌వ‌రం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో త‌మ పార్టీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డమ‌నే బాధ్య‌త‌లు త‌మకు అప్ప‌జెప్పిన నేప‌థ్యం రాష్ట్రమంత్రుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్రం ప్రకటన - ఏపీలోని ఆందోళ‌న‌లు - అసంతృప్తి యావత్తు ఈ ఏడాది చివరిలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన మత్రుల్లో స్పష్టంగా కనబడుతుండ‌టం గ‌మ‌నార్హం.

శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొద‌టిరోజుతో పాటు రెండో రోజు సైతం స‌భ‌ పలుమార్లు వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాల‌ సమయం పూర్తయిన దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు నిరసనగా నినాదాలు మొదలుపెట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఆ సమయంలో పలువురు మంత్రులు - కొందరు సీనియర్ శాసనసభ్యులు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చట్లు పెడుతూ ఈ విష‌యాలు వెల్ల‌డించారు. హోదా సెంటిమెంట్‌ గా మారిన నేప‌థ్యంలో ఈ దశలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కేంద్రం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చాలా తేలిగ్గా వ్యవహరించింద‌ని ప‌లువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. జైట్లీ ప్రకటన సారాంశం పూర్తిగా వెలుగు చూసిన తర్వాత ప్రజాస్పందనలో స్పష్టత వస్తుందని భావించామ‌ని అయితే ఆ ఆశ కూడా పోయింద‌ని చెప్తున్నారు.

ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కానపుడు ఇవ్వదలచుకున్న ప్రత్యామ్నాయాల విషయంలో కేంద్రప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నర క్రితమే ప్రత్యామ్నాయ ప్యాకేజీని ప్రకటించాల్సిన కేంద్రం ఇంతకాలం విషయాన్ని నాన్చటం ఏమీ బాగాలేదని పెదవి విరుస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అన్నది దశాబ్దాల నాటి డిమాండ్ అన్న విషయం తెలిసి కూడా కేంద్రం సదరు అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటమే కాకుండా విశాఖపట్నంకు బదులుగా విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటవుతుందని లీకులు ఇవ్వటంతో ఉత్తరాంధ్రలో ప్రజలు మండిపడుతున్నట్లు ప‌లువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇవ‌న్నీ క‌లిసి రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పుట్టి ముంచేలా ఉన్నాయ‌ని మంత్రులు మీడియా మిత్రుల‌తో చ‌ర్చించడం క‌నిపించింది.