Begin typing your search above and press return to search.

2017లో... తెలుగు నేల రాజ‌కీయాలు!

By:  Tupaki Desk   |   28 Dec 2017 2:00 PM IST
2017లో... తెలుగు నేల రాజ‌కీయాలు!
X
ఇంకో మూడు రోజులుంటే... 2017 కాలంలో క‌లిసిపోతుండ‌గా, కొత్త ఆశ‌ల‌తో, కొత్త ఆశ‌యాల‌తో 2018 మ‌న ముందుకు వ‌చ్చేస్తోంది. 2018కి స్వాగ‌తం ప‌లుకుతూ మ‌న నేతాశ్రీలు కూడా ఎవ‌రికి వారుగా త‌మ త‌మ ప్ర‌ణాళిక‌ల‌కు కొత్త రంగులు అద్దే ప‌నిలో ప‌డ్డార‌నే చెప్పాలి. ఈ కొత్త రంగులు ఎలా ఉన్నా... గ‌తించిపోతున్న 2017లో మ‌న నేతాశ్రీ‌లు... ప్ర‌త్యేకించి తెలుగు నేల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల వ్వ‌వ‌హారాల‌ను ఓ సారి గుర్తుకు తెచ్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే క‌దా. ఆ కోణంలోనే మ‌న నేత‌ల‌కు చెందిన, మ‌న నోళ్ల‌లో బాగా నానిన నేత‌లెవ‌ర‌న్న విష‌యాన్ని ఓ సారి ప‌రిశీలించుకుందాం. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న ఏపీ... రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీ, తెలంగాణ‌లుగా విడిపోయి ఇప్ప‌టికే నాలుగేళ్లు కావ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయాల‌తో పాటుగా రెండు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల‌ను మ‌నం గుర్తు చేసుకోవాల్సిందే.

మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల దృష్టిని బాగానే ఆక‌ర్షించిన నేత‌లుగా ఏపీలో విప‌క్ష నేత‌గా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించుకోవాలి. ఆ త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయాల‌ను బాగానే ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న యువ రాజ‌కీయ వేత్త‌ - తెలంగాణ టీడీపీకి భారీ దెబ్బ కొట్టేసి హ‌స్తం పార్టీలో చేరిపోయిన రేవంత్ రెడ్డి గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సిందే. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబునాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల విష‌యాల‌ను ప్ర‌స్తావించుకునేందుకు పెద్ద‌గా ఏమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఈ ఏడాదిలో వీరిద్ద‌రూ తీసుకున్న పెద్ద నిర్ణ‌యాలేమీ లేక‌పోగా... అంత‌గా ఆక‌ట్టుకున్న పాల‌న కూడా ఏమీ అందించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక వీరి పుత్ర‌ర‌త్నాలు నారా లోకేశ్, క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావుల గురించి ఓ మోస్త‌రు ప్ర‌స్తావ‌న చేసుకోవ‌చ్చు. ఇక జ‌న‌సేన పేరిట రాజ‌కీయ పార్టీని ఎప్పుడో స్థాపించేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి సై అంటూ ప్ర‌క‌టించేసి కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్రారంభించేసి జ‌నంలో బాగానే ఆస‌క్తి రేకెత్తించారు. అదే స‌మ‌యంలో తెలుగు నేల రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత‌లుగా చాలా మందే ఉన్నారు. వారిలో ఎవ‌రు ఏ మేర ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షించారు అన్న విష‌యాల‌ను ఓ సారి గుర్తు చేసుకుందాం.

1. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి...

ముందుగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తావ‌న తీసుకుంటే... 2019లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు జ‌గన్ ఇప్ప‌టికే త‌నదైన శైలిలో ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించేశార‌ని చెప్పాలి. తెలుగు నేల రాజ‌కీయాల్లో నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఉన్న విష‌యం తెలిసిందే. తొలుత ప‌దేళ్ల టీడీపీ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడేందుకు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేప‌ట్ట‌గా, ఆ త‌ర్వాత టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కూడా పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇక వైఎస్ కూతురిగా, జ‌గ‌న్ సోదరిగా వైఎస్ ష‌ర్మిళ చేప‌ట్టిన పాద‌యాత్ర కూడా జ‌నం దృష్టిని బాగానే ఆక‌ట్టుకుంది. ఈ యాత్ర‌ల‌న్నింటిని మించిపోయేలా ప్ర‌స్తుతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్నారు. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపుల‌పాయ‌లో రెండు నెల‌ల క్రితం ప్రారంభ‌మైన జ‌గ‌న్ యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల‌ను చుట్టేసి అనంత‌పురం జిల్లాలో కొన‌సాగుతుతోంది. నేడో, రేపో ఈ యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్ర‌వేశించ‌బోతోంది. ఈ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... తాను అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తానో చెప్ప‌డ‌మే కాకుండా... చంద్ర‌బాబు పాల‌న ఎలా సాగుతుంద‌న్న విష‌యాన్ని కూడా చెబుతూ వెళుతున్నారు. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా ఆరు నెల‌ల పాటు కొన‌సాగే ఈ యాత్ర 3 వేల కిలో మీట‌ర్ల మేర సాగ‌నుంది. చివ‌ర‌గా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగియ‌నుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ యాత్ర నిజంగానే తెలుగు నేల రాజ‌కీయాల్లో ఓ కీల‌క ఘ‌ట్టంగా నిల‌వ‌నుంది. ఓ వైపు అధికార పార్టీ ప్రారంభించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు టీడీపీలో చేరుతున్నా.. మొక్క‌వోని ధైర్యంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌.. నిజంగానే ఓ బ‌ల‌మైన నేత‌ను త‌ల‌పిస్తున్నారు. ఈ యాత్ర కొన‌సాగుతున్న కొద్దీ అధికార టీడీపీలో తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

2. రేవంత్ రెడ్డి...

ఇక తెలుగు నేల రాజ‌కీయాల‌ను జ‌గ‌న్ త‌ర్వాత బాగా ప్ర‌భావితం చేసిన నేత‌గా రేవంత్ రెడ్డిని చెప్పుకోవాలి. టీడీపీతోనే రాజ‌కీయ ఓన‌మాలు దిద్దిన రేవంత్‌... రాష్ట్ర విభ‌జ‌నకు ముందే తెలంగాణ‌లో ఓ బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ టికెట్ల‌పై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్క‌రొక్క‌రుగా టీఆర్ఎస్‌లో చేరుతున్న క్ర‌మంలో తెలంగాణ టీడీపీకి ఆయ‌నే పెద్ద దిక్కై పోయార‌ని కూడా చెప్పాలి. అయితే అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఏదో కోర్టు ప‌ని ఉందంటూ ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్క‌డ‌... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తెలుగు నేల రాజ‌కీయాల్లో పెను క‌ల‌క‌లాన్నే రేపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఆ త‌ర్వాత చోటుచేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య రేవంత్ టీడీపీకి హ్యాండిచ్చేసి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరేదాకా చాలా క్రియాశీలంగా క‌నిపించిన రేవంత్‌... ఇప్పుడు అంత‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్న వాద‌న ఇప్పుడిప్పుడే మొద‌లైంది. అయితే ఎన్నిక‌ల నాటికి రేవంత్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో తురుపు ముక్క‌గానే ప‌రిణ‌మిస్తార‌న్న అంచ‌నాలైతే ఉన్నాయి. అస‌లు టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీ క‌నుచూపు మేర‌లో లేద‌న్న వాద‌న ఉన్న స‌మ‌యంలో రేవంత్ చేరిక‌తో కొత్త జ‌వ‌స‌త్వాలు నింపుకున్న‌ కాంగ్రెస్ పార్టీ... టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే... ముఖ్య‌మంత్రిగా రేవంత్ అభ్య‌ర్థిత్వాన్నే పార్టీ ప‌రిశీలిస్తుంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

3. ప‌వ‌న్ క‌ల్యాణ్...

జ‌గ‌న్‌, రేవంత్ త‌ర్వాత ప్ర‌ధానంగా ప్ర‌స్తావించుకోవాల్సిన నేత‌గా మారిపోతున్న యాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తెరపైకి వ‌చ్చారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందుగానే జ‌న‌సేన పేరిట పార్టీ పెట్టిన ప‌వ‌న్‌... ఆ ఎన్నిక‌ల్లో ఎందుక‌నో గానీ పోటీ చేయ‌లేదు. అయితే టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్దతుగా ప్ర‌చారంలోకి దిగిన ప‌వ‌న్‌... ఏపీలో టీడీపీకి అధికారం ద‌క్క‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ తీసుకునే స్టాండ్‌ను బ‌ట్టి ఆయా పార్టీల భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ప్రస్తుతానికి టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వ‌స్తున్న ప‌వ‌న్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను, త‌న పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థులు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని ఇప్పటికే ప్ర‌క‌టించేశారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌తో పొత్తు కొన‌సాగుతుందా? లేదా? అన్న డైల‌మాలో టీడీపీ ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో అడ‌పాద‌డ‌పాగానే బ‌య‌ట‌కు వ‌స్తున్న ప‌వ‌న్‌... నిజంగానే టీడీపీ స‌ర్కారులో భయాన్ని అంత‌కంత‌కూ పెంచేస్తున్నారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్ర‌త్యేక హోదా గానీ, ఇత‌రత్రా అంశాల‌పై ప‌వ‌న్ బాగానే గ‌ళం విప్పుతున్నారు. ఇటీవ‌ల నాలుగు రోజుల పాటు ఏపీలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ ప‌లు కీల‌క అంశాల‌పై చంద్ర‌బాబు స‌ర్కారును ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాకుండా మంగ‌ళ‌గిరి స‌మీపంలో పార్టీ కార్యాలయం కోసం ఆయ‌న ఓ స్థ‌లాన్ని లీజుకు తీసుకున్న వైనం, దానిపై రేగిన వివాదం కూడా ప‌వ‌న్‌ను వార్తల్లో వ్య‌క్తిగా నిలిపేసింది. మొత్తంగా 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సాంతం ప‌వ‌న్ చేసిన కార్య‌క్ర‌మాలు, ఆయా అంశాల‌పై ఆయ‌న స్పందించిన తీరు నిజంగానే ఆస‌క్తి రేకెత్తించింది.

4. నారా లోకేశ్...

ఇక నారా లోకేశ్ విష‌యానికి వ‌స్తే... అప్ప‌టిదాకా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేశ్... ఈ ఏడాదిలోనే కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు కేబినెట్ లో మంత్రిగా చేరిన లోకేశ్... అంత‌కుముందు ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అయితే లోకేశ్ చ‌ట్ట‌స‌భలోకి ఎంట్రీ ఇచ్చిన విధానంపై విమ‌ర్శ‌లు రేకెత్తాయి. ఓ సీఎం కుమారుడిగా ఉంటూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా గెలిచి చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగుపెట్టాల్సిన లోకేశ్... ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డి దొడ్డిదారిని ఎంచుకుని శాస‌న‌మండ‌లి స‌భ్య‌త్వం ద్వారా మంత్రిగా మార‌డ‌మేమిట‌ని దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు ఆయ‌న‌పై సెటైర్లు వేశాయి. ఇక మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కూడా లోకేశ్ ప‌లు స‌భ‌లు, స‌మావేశాల్లో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ప‌రిణ‌తి లేకుండా వ్య‌వ‌హ‌రించి సోష‌ల్ మీడియాలో బాగానే తిట్టించేసుకున్నారు. అస‌లు విష‌యం లేని లోకేశ్ ను మంత్రిగా ఎలా చేర్చుకున్నారంటూ చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌కులు దాడి చేశారు. అయితే ఈ విమ‌ర్శ‌ల‌న్నింటినీ చాలా లైట్ తీసుకున్న లోకేశ్ కాల‌క్ర‌మంలో కాస్తంత విష‌య ప‌రిజ్ఞానం తెచ్చుకోవ‌డంతో పాటుగా... ఆయా అంశాల‌పై ప‌ట్టు సాధించే దిశ‌గానూ ముందుకు సాగుతున్నారు. పార్టీలో కీల‌క ప‌ద‌విని ఇప్ప‌టికే ద‌క్కించుకున్న లోకేశ్... 2017లోనే చ‌ట్ట‌స‌భ స‌భ్యుడిగానే కాకుండా మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి వార్తల్లో వ్య‌క్తిగా నిలిచారు.

5. కేటీఆర్‌...

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే... నారా లోకేశ్ మాదిరిగా కాకుండా టీఆర్ఎస్ యువ‌నేత క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు త‌న‌దైన శైలిలో స‌త్తా క‌లిగిన రాజ‌కీయ వేత్త‌గా రాణిస్తున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే సిరిసిల్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన కేటీఆర్ బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత పార్టీ అధినేత, త‌న తండ్రి కేసీఆర్ మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్‌... తెలంగాణ‌ను పారిశ్రామిక రంగంలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ‌కు పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వస్తున్నాయంటే... అందుకు కేటీఆర్ కృషే కార‌ణ‌మ‌ని చెప్పాలి. ఇక పుర‌పాల‌క శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుతున్నారు. మొన్న‌టికి మొన్న హైద‌రాబాదు వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌ను తెలంగాణ స‌ర్కారు దిగ్విజ‌యంగా నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సు విజ‌యవంతం కావ‌డానికి కేటీఆర్ అవిశ్రాంతంగా కృషి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. హైద‌రాబాదును సుంద‌రంగా తీర్చిదిద్డ‌డంతో పాటుగా జీఈఎస్ స‌మ్మిట్ కు వ‌చ్చిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌, ఇత‌ర దేశాల ప్ర‌తినిధుల‌ను కేటీఆర్ త‌న‌దైన శైలితో ఇట్టే ఆక‌ట్టుకున్నారు. ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన ప్ర‌ధాని మోదీ కూడా సీఎంగా ఉన్న కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ ప‌ట్లే అమితాసక్తి క‌న‌బ‌ర‌చారు. కేటీఆర్‌ను ద‌గ్గ‌ర‌కు పిలుచుకుని మ‌రీ మోదీ అభినందించిన తీరే కేటీఆర్ స‌త్తాకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. ఈ క్ర‌మంలోనే ప‌లు జాతీయ అవార్డులు కేటీఆర్‌ను వెతుక్కుంటూ మ‌రీ వ‌స్తున్నాయ‌ని చెప్పాలి.

6. ఎలిమినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే... టీడీపీకి న‌మ్మ‌క‌స్తులుగా ఉన్న ఎలిమినేటి ఫ్యామిలీ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయింది. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు టీడీపీని స్థాపించిన నాటి నుంచి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి ఆయ‌న వెంటే న‌డిచారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీలోనే కాకుండా ప్ర‌భుత్వంలోనూ కీల‌క భూమిక పోషించిన మాధ‌వ‌రెడ్డి... చంద్ర‌బాబు హ‌యాం వ‌చ్చే సరికి పార్టీలో నెంబ‌ర్ టూ స్థానానికి ఎగ‌బాకారు. ఉమ్మ‌డి రాష్ట్రానికి హోంమంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న నాడు బ‌లంగా ఉన్న న‌క్స‌ల్స్‌కు టార్గెట్ అయ్యారు. అదే స‌మ‌యంలో న‌క్స‌ల్స్ పేల్చిన బాంబుల‌కు ఆయ‌న బ‌లైపోయారు కూడా. అయితే పార్టీకి మాధ‌వ‌రెడ్డి చేసిన సేవ‌ల‌ను గుర్తించిన చంద్ర‌బాబు... మాధ‌వ‌రెడ్డి స‌తీమ‌ణి ఉమా మాధ‌వ‌రెడ్డికి పార్టీలో మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. త‌న కేబినెట్‌లో మంత్రిగా అవ‌కాశం క‌ల్పించ‌డ‌మే కాకుండా న‌ల్ల‌గొండ జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాల‌న్నింటినీ ఉమాకే అప్ప‌గించారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న ఫ‌లితంగా తెలంగాణ‌లో టీడీపీ గ్రాఫ్ బాగా ప‌డిపోయిన నేప‌థ్యంలో ఇటీవ‌లే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి స‌మాలోచ‌న‌లు చేసిన ఉమా...త‌న త‌న‌యుడితో క‌లిసి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఫ‌లితంగా టీడీపీకి న‌మ్మ‌క‌స్తులుగా ఉన్న ఎలిమినేటి ఫ్యామిలీతో పాటు ఆ కుటుంబానికి ఉన్న అశేష అభిమానులు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

7. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి...

రెండు తెలుగు రాష్ట్రాల్లో విప‌క్ష పార్టీల నుంచి అధికార పార్టీల్లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతుంటే... అందుకు భిన్నంగా అధికార పార్టీని ఆ పార్టీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేసిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి కూడా 2017లో జనం నోళ్ల‌లో బాగానే నానారు. నంద్యాల బైపోల్స్ సంద‌ర్భంగా త‌న సోద‌రుడు శిల్పా మోహ‌న్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోగా... తానూ త‌న సోద‌రుడి వెంటే న‌డుస్తాన‌ని చెప్పిన చ‌క్ర‌పాణిరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి బ‌హిరంగ స‌భా వేదిక‌పై రాజీనామా చేసేసి సంచ‌ల‌న సృష్టించారు. ఆ ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డి ఓట‌మి పాలైనా కూడా... తెలుగు రాష్ట్రాల్లో కొన‌సాగుతున్న పార్టీ ఫిరాయింపులకు ఓ స‌వాల్ విసురుతూ చ‌క్ర‌పాణిరెడ్డి చేసిన రాజీనామా నిజంగానే సంచ‌ల‌నం రేకెత్తించింది.