Begin typing your search above and press return to search.

తన పై బెట్టింగులు వేయొద్దంటున్న ఎంపీ అభ్యర్థి!

By:  Tupaki Desk   |   13 May 2019 4:30 PM GMT
తన పై బెట్టింగులు వేయొద్దంటున్న ఎంపీ అభ్యర్థి!
X
ఎన్నికల ఫలితాలపై జనాల్లో ఎంత ఆసక్తి ఉందో.. ఈ ఎన్నికల పందేరం పై బెట్టింగ్ రాయుళ్ల ఆసక్తి అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉంది. సామాన్య జనం కేవలం రాజకీయ ఆసక్తులతోనే ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారు అనే అంశం గురించి చర్చించుకొంటూ ఉన్నారు. వారి చర్చల్లో తమ తమ రాజకీయ అభిమానాలు - అభిప్రాయాలు మిళితం అయి ఉన్నాయి.

ఇక ఇవే ఎన్నికలను తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వాళ్లు బెట్టింగులు వేయడానికి అతీతమైన అంశం ఏదీ లేదు. అలాంటిది ఇంతటి రసవత్తరమైన ఎన్నికలకు సంబంధించి బెట్టింగులు వేయడం అంటే.. అంతకన్నా మజా ఏముంటుంది. దీంతో ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై వందల కోట్ల రూపాయల బెట్టింగులు నడుస్తూ ఉన్నాయి.

వీటన్నింటికీ క్లైమాక్స్ ఫలితాలు వచ్చే రోజున ఉంటుంది. ఇక ఈ బెట్టింగుల విషయంలో రాజకీయ పార్టీల నేతలు కూడా యాక్టివ్ గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమ అనుచరులు ఏ స్థాయిలో బెట్టింగులు వేసుకోవాలో వారే చెబుతున్నారని భోగట్టా.

తమ విజయం పై తమ అనుచరులు బెట్టింగ్ వేస్తున్న నేపథ్యంలో సదరు నేతలు వారికి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎంత వరకూ బెట్టింగ్ కాయొచ్చు - బెట్టింగ్ విజయం మీదనా లేక మెజారిటీ మీదనా.. అనే అంశాల గురించి వారు అనుచరులకు సలహాలు సూచనలు ఇస్తున్నట్టుగా సమాచారం.

మరి అలాంటి వారిలో ఒకరైన ఒక రాజకీయ నేత తన మీద ఎవరూ బెట్టింగ్ కాయొద్దని సలహా ఇస్తున్నారట. ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థి. తన విజయం మీద కానీ - తన మెజారిటీ మీద కానీ ఎవరూ
బెట్టింగులు వేసుకోవద్దని.. ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి.. అనవసరంగా డబ్బులు వేసి వాటిని పోగొట్టుకుని గుల్ల కావొద్దని సదరు నేత తన అనుచరులకు సూచిస్తున్నాడట. గెలుస్తాడో ఓడతాడో కానీ.. ఆ నేత విలువైన సూచనే చేస్తూ ఉన్నాడు. గాలి లెక్కలతో పందేలు కాసి డబ్బులు పోగొట్టుకోవద్దని ఆయన అనుచరులకు హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్నాడు.