Begin typing your search above and press return to search.

ఆంధ్రుడి డౌట్‌​: ఏపీ ఎంపీల‌కు సిగ్గు​, రోషం లేదా?

By:  Tupaki Desk   |   22 July 2015 9:12 AM GMT
ఆంధ్రుడి డౌట్‌​:  ఏపీ ఎంపీల‌కు సిగ్గు​, రోషం లేదా?
X
ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆ మ‌ధ్య మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌టం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ఎంపీల చేత‌కాని త‌నాన్ని.. నిర్ల‌క్ష్యాన్ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం తెలిసిందే. ఏపీ ఎంపీల‌కు సిగ్గు లేదా? రోషం లేదా?తెలంగాణ ఎంపీల మాదిరి పోరాట స్ఫూర్తి చూపించ‌రే? సొంత వ్యాపారాలు మాత్ర‌మే కాదు.. జ‌నాల స‌మ‌స్య‌లు కూడా ప‌ట్టించుకోండి?ఏపీకి న్యాయంగా అందాల్సిన ప్ర‌త్యేక హోదా గురించి ఎందుకు పోరాడ‌టం లేదు? అంటూ వ‌రుస‌గా సంధించిన ప్ర‌శ్న‌లు ఏపీ ఎంపీల‌కు కాస్తంత చురుకుపుట్టించిన‌ట్లుగా క‌నిపించింది.

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తున్న‌ప్పుడు.. ప‌వ‌న్ ప్ర‌స్తావించిన మాట‌ల కంటే కూడా.. త‌మ పేర్ల‌ను ప్ర‌స్తావించ‌టంతోనే ఒళ్లు మండింది త‌ప్ప‌.. మ‌రొక‌టి కాద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది.

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా బుధ‌వారం ఢిల్లీలో రెండు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఈ రెండింటికి ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేకున్నా.. రెండు జ‌రిగింది మాత్రం తెలుగువారి కార‌ణంగా అన్నది మ‌ర్చిపోకూడ‌దు.

మొద‌టి ఉదంతం చూస్తే.. విలేక‌రుల‌తో మాట్లాడిన కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు (నెల్లూరు జిల్లాకు చెందిన‌) విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్ప‌లేద‌ని.. ఆ విష‌యం చ‌ట్టంలో లేద‌ని చెప్పుకొచ్చారు.
త‌న‌కు తాను.. విభ‌జ‌న బిల్లు స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో మాట్లాడాన‌ని.. నాటి ప్ర‌ధానమంత్రి ఐదేళ్లు ఏపీకి ప్ర‌త్యేక హోదా అంటే.. మ‌రో నాలుగు నెల‌ల్లో మేం అధికారంలోకి వ‌స్తున్నాం.. ప‌దేళ్లు ఇస్తామ‌న్న వెంక‌య్య.. గ‌తంలో తాను చెప్పిన మాట‌లకు భిన్నంగా వ్యాఖ్య‌లు చేశారు. దీనికి ఒక్క‌రంటే ఒక్క ఏపీ ఎంపీ కూడా స్పందించిన పాపాన పోలేదు.

ఒక ప‌క్క పార్ల‌మెంటు సెష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. మంత్రి ఇంత మాట అంటే.. ఎంత‌లా విరుచుకుప‌డాలి? కానీ అదేం లేకుండా చేత‌కాని ద‌ద్ద‌మ్మాల్లా ఉండిపోయార‌న్న భావ‌న క‌లిగేలా కామ్ గా ఉండిపోయారు.

మ‌రోవైపు.. హైకోర్టు విభ‌జించ‌కుండా కేంద్ర‌మంత్రులు అడ్డుకుంటున్నార‌ని తెలంగాణ ఎంపీలు పార్ల‌మెంటులోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టంతోపాటు.. పార్ల‌మెంటులో కూడా దీన్ని ప్ర‌స్తావిస్తామ‌ని.. స‌భ‌ను అడ్డుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. ఒక‌ప‌క్క త‌మ హ‌క్కుల కోసం అలుపు ఎర‌గ‌కుండా తెలంగాణ ఎంపీలు పోరాటం చేస్తుంటే.. మ‌రోవైపు ఏపీ ఎంపీలు మాత్రం ఏం ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇవ‌న్నీ చూస్తున్న‌ప్పుడు.. ఏపీ ఎంపీల‌కు సిగ్గు.. రోషం ఉంద‌ని ఏ సీమాంధ్రుడు మాత్రం అనుకుంటారంటూ స‌గ‌టు సీమాంధ్రుడు మండిప‌డుతున్నాడు.