Begin typing your search above and press return to search.

హైకోర్టు గురించి ఏపీ ఎంపీలు మాట్లాడ‌రేం?

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:23 AM GMT
హైకోర్టు గురించి ఏపీ ఎంపీలు మాట్లాడ‌రేం?
X
త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కించిత్ కూడా వెన‌క్కి త‌గ్గ‌ని తెలంగాణ ఎంపీలు దూసుకెళుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఆందోళ‌న చేయ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు ఆ విష‌యాన్ని లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేయ‌గ‌లిగారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు అన్న విష‌యం విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా ఉంద‌ని.. క‌చ్ఛితంగా దాన్ని అమలు చేస్తామ‌ని.. ప్ర‌స్తుతం న్యాయ‌శాఖ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌త్యేక హైకోర్టు విష‌యంలో అడుగులు ముందుకు ప‌డుతుంటే.. మ‌రోవైపు.. ఏపీ ఎంపీలు హైకోర్టు గురించి అస్స‌లు పెద‌వి విప్ప‌టం లేదు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి హైకోర్టు హైద‌రాబాద్‌లో ఉంది. తెలంగాణ ఎంపీల ఆందోళ‌న ఫ‌లించి తెలంగాణ హైకోర్టు ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశార‌నుకుందాం? ఏపీ హైకోర్టు మాటేమిటి? ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధానిలో భాగంగా ఏపీ హైకోర్టు హైద‌రాబాద్‌లోనే ఉండాలా? ఒక‌ప‌క్క ప్ర‌భుత్వ శాఖ‌లు వీలైనంత త్వ‌ర‌గా హైద‌రాబాద్ వ‌దిలి విజ‌య‌వాడ వెళ్లిపోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టం తెలిసిందే.

మ‌రి.. ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వెళితే.. ఏపీ హైకోర్టును ఎక్క‌డ ఏర్పాటు చేస్తారు? దానికి అవ‌స‌ర‌మ‌య్యే భారీ భ‌వ‌నాన్ని ఎక్క‌డ క‌డ‌తారు? అందుకు నిధులు ఎంత ఇస్తారు? మౌలిక స‌దుపాయాల మాటేమిటి? ఇలా స‌వాల‌క్ష విష‌యాలు ఉన్నాయ‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ నేత‌లు ప్ర‌త్యేక హైకోర్టు గురించి మాట్లాడుతుంటే.. ఏపీ ఎంపీలు త‌మ హైకోర్టుకు సంబంధించి కేంద్రం ఏం చేయ‌నుంద‌న్న ప్రాధ‌మిక ప్ర‌శ్న‌ను ఇంత‌వ‌ర‌కు వేయ‌లేద‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు.

నోట మాట రాని మూగవారి మాదిరి ఏపీ ఎంపీలు ఉండిపోతే.. రేపొద్దున తెలంగాణ ఎంపీల‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఇచ్చేస్తే.. ఏపీ హైకోర్టును హైద‌రాబాద్‌లోనే ఉంచేయాలి. దీనికి స‌వాల‌క్ష పంచాయితీలు మొద‌లు కావొచ్చు. ఇప్ప‌టికే ఏపీ హైకోర్టు గురించి తెలంగాణ అధికార‌ప‌క్ష ఎంపీలు ప్ర‌స్తావిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఏపీ హైకోర్టుకు త‌మ‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు మాట్లాడుతున్నారు. ఏపీలో హైకోర్టు భ‌వ‌నం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్న ఆఫ‌ర్ ఇస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఏపీ హైకోర్టుకు సంబంధించి తెలంగాణ ఎంపీలు హామీలు ఇవ్వ‌టం ఏమిటి? త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినా.. ఒకసారి వారి డిమాండ్లు సాధించ‌టం పూర్తి అయితే.. తెలంగాణ అధికార‌ప‌క్షం నేత‌ల గ‌ళం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి.. ఇలాంట‌ప్పుడు.. టీ స‌ర్కారు ద‌యాదాక్షిణ్యాల మీద ఏపీ హైకోర్టు హైద‌రాబాద్‌లో ఉండాలా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ విజ‌య‌వాడ‌లోఉంటే.. హైకోర్టు హైద‌రాబాద్‌లో ఉంటే.. ప్ర‌తి చిన్న అవ‌స‌రానికి విజ‌య‌వాడ నుంచి హైకోర్టుకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు.. వివిధ కేసుల‌కు సంబంధించి రాజ‌ధాని ఒక‌చోట‌.. హైకోర్టు వేరే రాష్ట్రంలో ఉంటే ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంత ఇబ్బంది?

అంత‌దాకా ఎందుకు? విభ‌జ‌న త‌ర్వాత అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ సేవ‌ల్ని ఏడాది పాటు కొన‌సాగించిన తెలంగాణ స‌ర్కారు.. ఏడాది పూర్తి అయిన త‌ర్వాత‌.. ఏపీ విద్యార్థుల‌కు అంబేడ్క‌ర్ వ‌ర్సిటీ సేవ‌లు అందించాలంటే ప్ర‌త్యేక ఒప్పందం చేసుకోవాల‌ని రూల్ పెట్టింది లేదా?

రేపొద్దున తెలంగాణ ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన త‌ర్వాత‌.. ఏపీ హైకోర్టు హైద‌రాబాద్ లోకొన‌సాగితే.. ఆ భ‌వ‌నాల‌కు ఆస్తిప‌న్ను.. వాటికి విద్యుత్తు.. ఇత‌ర మౌలిక‌స‌దుపాయాల కోసం ప్ర‌త్యేక ఒప్పందం చేసుకోవాల‌ని.. సేవ‌ల రూపంలో డ‌బ్బు క‌ట్టాలంటే నోరు మూసుకొని క‌ట్టాలి. లేదంటే.. ఏదైనా తేడా వ‌చ్చిన‌ప్పుడు.. ఇంకా సిగ్గు లేదా.. హైద‌రాబాద్ వ‌దిలి మీరెప్పుడు వెళ్లిపోతారంటే ప‌రిస్థితి ఏంటి?

ప‌్ర‌భుత్వ కార్యాల‌యాలంటే ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం మీద ఉంటుంది. కానీ.. హైకోర్టు వ్య‌వ‌హారం అలా ఉండ‌దు. కేంద్రం జోక్యం అవ‌స‌రం. అదే స‌మ‌యంలో ఇలాంటి విష‌యాల‌పై కేంద్రాన్ని న‌మ్ముకోలేని దుస్థితి. ఇప్ప‌టికే ప‌లు పంచాయితీల్లో కేంద్రం ఎలా చేతులు ఎత్తేసిందో తెలిసిందే.

అలాంట‌ప్పుడు.. హైకోర్టు విష‌యంలో అన‌వ‌స‌ర పంచాయితీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. తెలంగాణకు ప్ర‌త్యేక హైకోర్టు కేటాయించే స‌మ‌యంలోనే.. ఏపీలో త‌న‌దైన హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేశాకే విభ‌జించ‌టం మంచిది. అవ‌స‌ర‌మైతే.. ఇందుకోసం ఒక నిర్ణీత కాల ప‌రిమితిని నిర్ణ‌యించించి.. రెండు ప్ర‌త్యేక హైకోర్టుల్ని వేర్వేరుగా ఏర్పాటు చేయ‌టం మంచిది.

మ‌రి..ఈ విష‌యంపై రాజ‌కీయపార్టీలు మొద‌లు.. న్యాయ‌వాదుల వ‌ర‌కు అంద‌రూ మౌనంగా ఉన్న ప‌రిస్థితి. ఇప్పుడు కానీ.. నోరు విప్ప‌క పోతే.. విభ‌జ‌న స‌మ‌యంలో జ‌రిగిన న‌ష్ట‌మే.. మ‌రోసారి జ‌రిగే అవ‌కాశం ఉంది. అందుకే.. వాళ్ల మీదా..వీళ్ల మీదా ఆధార‌ప‌డ‌కుండా.. ఏపీలో ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు విష‌యంపై ఏపీ నేత‌లు.. లాయ‌ర్లు గ‌ళం విప్పాల‌ని ఏపీకి చెందిన మేధావులు కోరుకుంటున్నారు.