Begin typing your search above and press return to search.

ఆ మూడు నగరాలూ మరింత స్మార్టు

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:49 AM GMT
ఆ మూడు నగరాలూ మరింత స్మార్టు
X
దేశంలోని పలు నగరాలను స్మార్టు సిటీలుగా డెవలప్ చేయడానికి కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఏపీ నుంచి దీని కోసం మూడు పేర్లతో ప్రతిపాదనలు వెళ్లాయి. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్టు సిటీలుగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.

దేశంలో 100 స్మార్టు సిటీల నిర్మాణానికి గాను కేంద్రం జులై 31లోగా ప్రతిపాదనలు పంపించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. దీనికి రాష్ట్రాల నుంచి మంచి స్పందన వచ్చింది. మొదటి దశలో 20 నగరాలను ఇలా అభివృద్ధి చేస్తారు. దీనికి గాను మూడంచెల ప్లానును కేంద్రం అమలు చేస్తోంది. తొలుత ఏ రాష్ట్రంలో ఎన్ని నగరాలను స్మార్టు నగరాలుగా అభివృద్ధి చేయాలో ఆ సంఖ్య మేరకే రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటారు. దాని ప్రకారమే ఏపీ నుంచి 3 పేర్లు కోరగా విశాఖ, తిరుపతి, కాకినాడలను ప్రతిపాదించారు. రెండో అంచెలో కేంద్రం ఆయా నగరాలను దేశంలో ఇతర అభివృద్ధి చెందిన నగరాలతో పోల్చి చూస్తుంది.... చివరకు మూడో అంచెలో వంద నగరాల జాబితా సిద్ధం చేస్తుంది. ఆ జాబితాలోని నగరాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. నిర్దిష్ట ప్రణాళిక మేరకు స్మార్టు సిటీల మార్గదర్శకాల ప్రకారం వాటిని అభివృద్ది చేస్తారు.

కాగా ఏపీ ప్రతిపాదించిన విశాఖ, కాకినాడ, తిరుపతిలు ఇప్పటికే కొంత అభివృద్ధి చెందిన నగరాలు.. అయితే.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టితో మరింత స్మార్టుగా మారనున్నాయి. విశాఖలో, కాకినాడలో ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని ఆ రెండు నగరాలను పర్యాటక ధామాలుగా మలచనున్నారు. ఇక తిరుపతి కూడా వెంకటేశ్వరుని ఆలయం కారణంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇప్పుడు ఇవి మరింత స్మార్టుగా మారితే ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకుంటాయనడంలో సందేహం లేదు. కాగా ప్రతిపాదనలు పంపించడంతో స్మార్టు సిటీల కార్యక్రమం ఇక ఊపందుకోనుంది.