Begin typing your search above and press return to search.

ఇంకా అంతే : పవన్ ఆదేశాలే చంద్రబాబుకు వేదం

By:  Tupaki Desk   |   17 March 2018 9:33 AM GMT
ఇంకా అంతే : పవన్ ఆదేశాలే చంద్రబాబుకు వేదం
X
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన టేకప్ చేస్తున్నాం ప్రజా సమస్యల విషయంలో ఇన్నాళ్లూ ఒక తరహాగా నడిచింది. రాష్ట్రంలో అప్పుడప్పుడూ ప్రజల ముందు కనిపించి... ఆయన ఒక్కొక్క ఉద్యమాన్ని ప్రారంభించడమూ, ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టడం... ఆ వెంటనే చంద్రబాబు నాయుడు ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవడము జరుగుతూ వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా పోరాటాలు చేస్తున్నట్లుగా ప్రజల కోసం కట్టుబడి ఉన్నట్లు గా ఒక ముద్ర ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు తన వంతు సహకరించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని తూలనాడారు... అంటారు కానీ ఇప్పటికీ అదే తంతు నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

గుంటూరు అతిసారం బాధితుల గురించి పవన్ కళ్యాణ్ ఒక ఫత్వా జారీ చేయగానే చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించారు. అధికారుల మీద కన్నెర్ర చేశారు. హుద్ హుద్ తుఫాన్ స్ఫూర్తి ఏమైపోయింది అంటూ అధికారులను నిందించారు. మీకు చేతకాకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటా అంటూ హూంకరించారు. బాధితుల పరామర్శకు కూడా వెళ్లకపోవడాన్ని తీవ్ర నేరంగా పరిగణించారు. ఇలా రకరకాలుగా.. పవన్ కల్యాణ్ ఎలాంటి డిమాండ్లు అయితే వినిపించారో... అలాంటి చర్యలన్నీ తీసేసుకున్నారు.

మధ్యలో పవన్ కళ్యాణ్ 48 గంటల గడువు పెట్టడానికి సంబంధించి ఇది సినిమా కాదు అంటూ ఒక కౌంటర్ ఇచ్చారు గాని, మొత్తం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పని జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటువంటి రహస్య మిత్రబంధం కొనసాగించే బదులు బహిరంగ మిత్రులుగానే చెలరేగవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రజా పోరాటాల విషయంలో పవన్ ను మరింత హీరోగా ప్రొజెక్టు చేయడానికి, తెలుగుదేశం పార్టనర్ కాదు.. అయినా ప్రజల కోసం పోరాడుతారు.. అనే బిల్డప్ ఇవ్వడానికి ఇద్దరూ ఓ అవగాహనతో ఇలా చేస్తున్నారా? అని కూడా ప్రజలు తలపోస్తున్నారు.