Begin typing your search above and press return to search.

లెక్కలు చెప్పేటోళ్లంతా.. హైదరాబాద్ అప్పుడేం చేశారు!

By:  Tupaki Desk   |   7 Jan 2020 6:17 AM GMT
లెక్కలు చెప్పేటోళ్లంతా.. హైదరాబాద్ అప్పుడేం చేశారు!
X
ఏపీ రాజధానిని విశాఖకు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించటమే మిగిలిందా? అంటే అవుననే చెప్పాలి. లాంఛనప్రాయ ప్రకటన తప్పించి.. బ్యాక్ గ్రౌండ్ లో ఏపీ రాజధానిని విశాఖకు తరలించే కార్యక్రమం జోరందుకుందన్న మాట విశ్వసనీయంగా తెలిసిందే. రాజధాని విశాఖ అన్నంతనే కొందరు తెర మీదకు తెస్తున్న సిత్రమైన లెక్కలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

రాజధాని నగరం సెంటర్ పాయింట్ అన్నట్లు ఉండాలే కానీ.. ఆ మూలో.. ఈ మూలో ఉండకూడదన్నట్లుగా వినిపిస్తున్న వాదనతో పాటు.. ఏపీలోని ఏయే ప్రాంతాలకు ఎంతెంత దూరమన్న విషయానికి అంకెలతో చెబుతున్న తీరు అభ్యంతరకరంగా ఉందంటున్నారు. విశాఖ రాజధాని నగరంగా మారితే.. రాయలసీమలోని చాలా ప్రాంతాల వారికి దూరం అవుతుందని.. ఇది మరింత భారమని పేర్కొంటున్నారు.

రాయలసీమలోని చాలా ప్రాంతాలు విశాఖకు700 నుంచి 900 కిలోమీటర్ల మధ్యన ఉంటాయంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఒక వ్యక్తి విశాఖకు రావాలంటే 913 కిలోమీటర్లు ప్రయాణించాలని చెబుతున్నారు. ఇదే లెక్క హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు పలాస నుంచి హైదరాబాద్ కు.. కుప్పం నుంచి హైదరాబాద్ కు.. ఎందుకు వేయలేదు? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు తెలంగాణ జిల్లాలకు మాత్రమే సెంటర్ పాయింట్ గా ఉండేదని.. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని చాలా ప్రాంతాలు.. నెల్లూరు లాంటి కోస్తా జిల్లాలు కూడా దూరంగా ఉండేవన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు.

మదనపల్లిలో ఉన్న వారికి విశాఖకు చేరాలంటే బస్సులో 22 గంటలు.. రైళ్లో 18 గంటలు పడుతుందని చెప్పేవాళ్లు.. అదే మదనపల్లి నుంచి హైదరాబాద్ కు చేరాలంటే కూడా ఇంచుమించు అంతే సమయం పట్టేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహా అయితే.. రెండు..మూడు గంటలు తగ్గేది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 141 నియోజకవర్గాలు విశాఖకు 300 నుంచి 900 కిలోమీటరల దూరంలో ఉన్నాయని లెక్కలు చెప్పేవారు.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే ఉండేదని ఎందుకు మర్చిపోతున్నారు?

అంతదాకా ఎందుకు ఖమ్మం జిల్లాలోన ఏపీకి సరిహద్దుల్లో ఉన్న గ్రామం నుంచి హైదరాబాద్ కు బాగా దూరం కాబట్టి.. వారికి దగ్గరగా ఉండే చోట రాజధాని ఏర్పాటు చేయాలనటం ఎలా ఉంటుందో.. విశాఖ విషయంలో లెక్కలు చెప్పేవాళ్ల మాటలు అదే తీరులో ఉంటాయని చెప్పక తప్పదు.