Begin typing your search above and press return to search.

ఆంధ్రోడి స్టైల్ కాస్త డిఫరెంట్ బాస్

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:58 AM GMT
ఆంధ్రోడి స్టైల్ కాస్త డిఫరెంట్ బాస్
X
అవకాశాలు చెప్పి రావు. కొన్ని సందర్భాల్లో అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ప్రత్యేక హోదా హామీ మీద ఆంధ్రులకున్న ఆగ్రహం అంతాఇంతా కాదు. మిగిలిన వారి మాదిరే కోపాన్ని.. ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని ఇట్టే బయటపడేయరు. ఆచితూచి వ్యవహరిస్తారు. టైం చూసుకొని పైసలతో సహా లెక్క చెప్పేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. కానీ.. ఆంధ్రాలో మాత్రం అలా ఉండదు. అందుకే.. విభజనతో తమ గుండెల్లో గునపం గుచ్చిన కాంగ్రెస్ కు ఏపీలో సమాధి కట్టేయటమే కాదు.. సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి ఫ్యూచర్ లేకుండా చేశారు.

విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ఆంధ్రులు గుర్తుంచుకున్నారు. పవర్ లోకి రాకముందు ఒకలా.. పవర్ లోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్న పార్టీల మాటల్నివారు వింటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చేసిన వారిపై తమకున్న కోపాన్నికడుపులో దాచుకున్న ఆంధ్రులు సమయం కోసం చూస్తున్నారని చెప్పాలి. ఏపీ విభజన సమయంలోనూ గుంభనంగా ఉన్న వారు.. కేంద్రం తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాక కానీ కళ్లు తెరవలేదు. కొంతమంది ఆంధ్రోళ్ల చైతన్యంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.

వారి మాటల్లో కొన్ని నిజాలు ఉన్నా.. అన్నీమాత్రం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిగిలిన వారికంటే ఎక్కువగా ఆంధ్రోళ్లు నాయకుల్ని నమ్ముతారు. వారిని పాలించే నేతలు బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ అయినప్పటికీ.. ఒకసారి కాకుంటే మరోసారి అయినా తమను పట్టించుకుంటారని గుడ్డిగా నమ్మేస్తుంటారు. అదే ఇప్పుడు శాపంగా మారిన విషయాన్ని ఈ దఫా వారు బాగానే గుర్తించారని చెప్పాలి. దీనికి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాలి. ప్రత్యేక హోదా మీద గళం విప్పిన ఆయన.. పదే పదే ఏపీ ఎంపీల్లోని వ్యాపార కోణాన్ని ఆయన అందరికి అర్థమయ్యేలా చెప్పారని చెప్పాలి.

జల్లికట్టు మీద తమిళులు పోరాడి కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావటమే కాదు.. తమ వాదనను వినకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రోళ్లలో చాలామందిలో కొత్త స్ఫూర్తిని నింపింది. గడిచిన రెండు రోజులుగా వస్తున్న మేసేజ్ లు చూస్తే.. తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నది కేసీఆర్ సాధ్యం చేసి చూపించినప్పుడు.. జల్లికట్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మంత్రాంగం సక్సెస్ అయినప్పుడు.. ఏపీని మొత్తంగా మార్చేసే ప్రత్యేక హోదాను సాధించటం ఎందుకు కష్టం అవుతుందన్న ప్రశ్న ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రత్యేక హోదా సాధ్యమే కాదంటూ పలువురు చెబుతున్న వ్యాఖ్యల స్థానే..అసాధ్యమన్న తెలంగాణ ఎలా సాధ్యమైందన్న ఎదురుప్రశ్న ఆలోచనల్లో పడేసేలా చేస్తోంది. ఎగిసిపడే అలల మాదిరి విరుచుకుపడటం ఆంధ్రులకు చేతకాదంటారు. తుఫాను ముందు ప్రశాంతత మాదిరి ఉండటం.. అంతకంతకూ నమ్మి.. ఎంతకూ తమను పట్టించుకోని వారిపై తిరుగులేని విధంగా.. మళ్లీ కోలుకోలేని చందంగా దెబ్బేయటం ఆంధ్రోడికి అలవాటుగా చెబుతుంటారు. మరి.. ఆ స్టైల్ ప్రత్యేక హోదా విషయంలో మరోసారి నిజమవుతుందో ? లేదో? చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/