Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌కు వేద‌న‌ను మిగిల్చావే వెంక‌య్యా!

By:  Tupaki Desk   |   5 Aug 2017 4:41 AM GMT
ఆంధ్రోళ్ల‌కు వేద‌న‌ను మిగిల్చావే వెంక‌య్యా!
X
ఏపీ రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలోనూ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ బీజేపీ సీనియ‌ర్ నేత‌.. కాబోయే ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడి వైఖ‌రిని వ‌దిలేస్తే.. ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్ట‌టానికి ఆంధ్రోళ్ల‌కు పెద్ద విష‌యాలేమీ క‌నిపించ‌వ‌ని చెప్పాలి. చేతిలో ఎంతో ప‌వ‌ర్ ఉన్నా.. సొంత ప్రాంతానికి ఏమీ చేయ‌లేని వ్య‌క్తిగా ఆంధ్రోళ్ల మ‌న‌సుల్లో వెంక‌య్య నిలిచిపోయార‌ని చెప్పాలి. ప్రోటో కాల్ ప్ర‌కారం దేశంలో అత్యున్నత స్థానాల్లో రెండోదైన ఉప రాష్ట్రప‌తి కుర్చీలో రోజుల వ్య‌వ‌ధిలో కూర్చోనున్న వేళ‌.. ఆంధ్రోళ్ల ప‌రిస్థితి మ‌హా ఇబ్బందిగా మారింద‌ని చెప్పాలి.

ఈ రోజు ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆయ‌న విజ‌యం మీద ఎవ‌రికి ఎలాంటి సందేహాల్లేవు. ఆయ‌న గెలుపు ముందే డిసైడ్ అయిపోయింద‌ని చెప్పాలి. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎలా అయితే అంద‌రూ క‌లిసి వ‌స్తారో.. వెంక‌య్యకు ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు బీజేపీకి మిత్ర‌ప‌క్షం కాని టీఆర్ఎస్ తో స‌హా చాలానే పార్టీలు ఇప్పుడు ఆయ‌న‌కు ఓటు వేయ‌నున్నాయి.

అయినోళ్ల మ‌న‌సుల్ని గెలుచుకోలేని వెంక‌య్య‌.. ప‌రాయివాళ్ల మ‌న‌సుల్ని దోచుకొని దేశంలోనే అత్యున్న‌త స్థానాల్లో ఒక‌టైన కుర్చీలో కూర్చోనున్నారు. త‌మ‌వాడు పెద్ద ప‌ద‌విలో కూర్చోబోతున్న సంతోషాన్ని ఆంధ్రోళ్ల‌కు లేకుండా చేయ‌టంలో వెంక‌య్య స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.మామూలుగా అయితే.. ఇలాంటి స‌న్నివేశాల్లో.. సొంతోళ్ల మ‌ద్ద‌తు పెద్ద ఎత్తున ఉండ‌ట‌మే కాదు.. త‌మ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి అత్యున్న‌త ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నార‌న్న భావోద్వేగం క‌దిలిపోవ‌టం క‌నిపిస్తుంది.

కానీ.. వెంక‌య్య విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్పాలి.ఆయ‌న్ను ఉప రాష్ట్రప‌తిగా చేసే విష‌యంలో సొంతోళ్ల కంటే కూడా ప‌రాయివాళ్లే ఎక్కువ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్పాలి. వెంక‌య్య గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు ఒక పాత సామెత ట‌క్కున మ‌దిలో మెదులుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినోళ్లకు ఆకుల్లో కానోళ్ల‌కు కంచాల్లో అన్న‌ట్లుగా.. అయిన వారి కోసం త‌పించ‌ని వెంక‌య్య‌.. కానోళ్ల కోసం ఎంతో చేశార‌న్న పేరుప్ర‌ఖ్యాతుల్ని సంపాదించుకోవ‌టం చూస్తే స‌గ‌టు ఆంధ్రోడికి న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితి. ఏపీ విభ‌జ‌న విష‌యంలో వెంక‌య్య స్టాండ్ మ‌ళ్లీ ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదు. స‌ర్లే.. ప‌రిస్థితులు క‌లిసి రాని వేళ‌లో వెంక‌య్య‌లాంటి ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్ ఢిల్లీలో ఉన్నా ఏం చేయ‌గ‌ల‌ర‌ని స‌రిపెట్టుకున్న‌ప్ప‌టికీ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌నిచ్చిన హ్యాండ్ ను మాత్రం ఆంధ్రోళ్లే ఎప్ప‌టికి మ‌ర్చిపోలేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

హోదా ఇష్యూలో ఆంధ్రోళ్ల‌కు వెంక‌య్య హ్యాండ్ ఇచ్చిన వైనాన్ని చూస్తే.. ఆంధ్రోళ్ల‌ను క‌ప్ప‌ల‌తో పోలుస్తూ చెప్పే క‌థ గుర్తుకు రాక మాన‌దు. నిజానికి ఈ క‌థ‌ను తెలుగోళ్ల‌కు అన్వ‌యిస్తూ చెబుతుంటారు. కానీ.. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అది తెలుగోళ్ల కంటే కూడా ఆంధ్రోళ్ల‌కు ప‌రిమితం చేస్తే బాగుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా.. అయినోళ్ల మ‌న‌సుల్ని దోచుకోలేని వెంక‌య్య మ‌హా పోటుగాడు అన‌టంలో సందేహం ఎంత‌మాత్రం లేదు. సొంతోళ్ల మ‌ద్ద‌తు లేకుండా ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి వ‌ర‌కూ ఎద‌టం మామూలు విష‌యం కాదుగా?