Begin typing your search above and press return to search.

మాటలొద్దు జైరాం.. మీరేం చేస్తారో చెప్పండి!

By:  Tupaki Desk   |   25 Feb 2018 9:22 AM GMT
మాటలొద్దు జైరాం.. మీరేం చేస్తారో చెప్పండి!
X
‘ప్రధాని నరేంద్రమోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే సంగతి మాకు తెలుసు. వారిద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రానికి ఏం ద్రోహం చేస్తున్నారో కూడా మాకు తెలుసు. వారికి ఎలా బుద్ధి చెప్పాలో మేం నిర్ణయించుకుంటాం. నువ్వు వచ్చి వారి కుమ్మక్కు గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం జరగడానికి తమరు ఏం చేయబోతున్నారో.. తమరికి ఎంత శ్రద్ధ ఉన్నదో.. మాకు ప్రత్యేకహోదా ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరెంత క్రియాశీలంగా వ్యవహరించబోతున్నారో.. అదిమాత్రం చెప్పు చాలు’ అంటూ కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ను ప్రజలు కోరుతున్నారు.

ఆదివారం నాడు విజయవాడకు వచ్చిన జైరాం రమేశ్ ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ దాని వెసులుబాటు గురించి నొక్కి చెప్పారు. 11 రాష్ట్రాలు ప్రత్యేకహోదా అనుభవిస్తుండగా ఏపీకి మాత్రం ఇవ్వడానికి మోడీకి ఉన్న అభ్యంతరం ఏమిటి? అని జైరాం రమేశ్ ప్రశ్నిస్తున్నారు.

అలాగే కేంద్రంలోని మోడీ - రాష్ట్రంలోని చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని - వారిద్దరి వల్ల రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదని ఆయన ప్రజలకు సలహా కూడా చెప్పారు.

కానీ ప్రజల వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ రాష్ట్రానికి ఎవరి వల్ల లాభం జరిగింది - ఎవరి వల్ల నష్టం జరుగుతున్నది, ఎవరు ఎలాంటి గేమ్ లు, ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు.. అనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. పైగా ఇతరుల జైరాం రమేశ్ చేసే ఆరోపణలకు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని ఆయన ఎన్నడో కోల్పోయారు.

కాకపోతే.. ఇప్పుడు ప్రత్యేక హోదాను - విభజన హక్కులను సాధించుకోడానికి ప్రతి ఒక్కరిసాయం అవసరమే గనుక.. ప్రజలు ఆయనను సహిస్తున్నారు. విభజన చట్టానికి సవరణ చేయగలిగే అవకాశం ఉందని ఆయన గతంలో అన్నారు. అదేదో కాంగ్రెస్ పార్టీనే పూనుకుని.. తాము చేసిన పాపాన్ని తామే ప్రక్షాళన చేసుకోవచ్చు కదా.. మధ్యలో తెదేపా - వైసీపీ అలాంటి ప్రతిపాదన చేయాలని వారి మీద నెపం వేయడం ఎందుకు అని కూడా ప్రజలు కోరుతున్నారు.