Begin typing your search above and press return to search.

జగన్ పరిణితిపై ప్రశంసలు

By:  Tupaki Desk   |   29 July 2018 11:30 AM GMT
జగన్ పరిణితిపై ప్రశంసలు
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహాన రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అధికారంలోకి వస్తే తాను ఏమి చేయగలడో - ఏమి చేయలేడో స్పష్టంగా చెబుతూండడంతో ప్రజలలో ఆయన పట్ల ప్రేమ - న‌మ్మ‌కం పెరుగుతోంది. శనివారం నాడు తూర్పు గోదావరి జిల్ల జగ్గంపేటలో జరిగిన సభలో జగన్ చేసిన ప్రసంగమే ఇందుకు తార్కణం. సభ జరిగిన జగ్గంపేట కాపులకు కంచుకోట. ఇక్కడ జరిగిన సభలో కాపు రిజర్వేషన్లపై మీ వైఖరి చెప్పాలంటూ కొందరు కాపు యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై స్పందించిన జగన్మోహాన రెడ్డి "ఈ అంశం కేంద్రం పరిధిలోనిది వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రస్తుత కాపు కార్పొరేషన్‌ కు మాత్రం ఇప్పుడు ఉన్న నిధుల కంటే రెట్టంపు నిధులు ఇస్తాను" అని స్పష్టం చేసారు. ఈ మధ్యనే జనసేనాని పవన్ కల్యాణ్‌ పై జగన్ మోహాన రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు వివాదం రేపాయ్. పవన్ కులస్థులైన కాపులు జగన్‌ కు దూరమవుతారని పలు కథనాలు కూడా వచ్చాయ్. అయినా వాటికి వెరవకుండా జగన్ సాధ్యాసాధ్యాలను అదే కాపు కులస్థులకు వారి కంచుకోటలోనే చెప్పారు. ఇదీ జగన్ మోహాన రెడ్డిలోని నిజాయితీకి - వాస్తవ దృక్ప‌థానికి నిదర్శనంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

గతంలో కూడా జగన్మోహన రెడ్డి రైతు రుణమాఫీపై ఇలాగే స్పందించారు. తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానంటూ ఒక పక్క చంద్రబాబునాయుడు హామీలిస్తున్న జగన్ మాత్రం అవి సాధ్యం కాదని ఆనాడే చెప్పారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ ల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షలే. ఒక వేళ ఆ ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చి ఉంటే అప్పుడు ఆయనే ముఖ‌్యమంత్రి. అయితే ఆనాడు కూడా వాస్తవ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ హామీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ హామితోనే అధికారంలోకి వచ్చాడు.

ఇప్పడు తాజాగా కాపులకు రిజర్వేషన్‌ పై కూడా సాధ్యం కాని హామీ అంటూ స్పష్టం చేసారు. ఈ పరిణితి మాత్రం నేడు జగన్‌ కు అధికారాన్ని తీసుకురావడం ఖాయంగానే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆ జిల్లాతో పాటు పొరుగునే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోనూ - అటు విశాఖపట్నం జిల్లాలోనూ కాపుల జనాభా ఎక్కువే. అయినా జగన్ మాత్రం రాజకీయ జిమ్మిక్కులకు పోకుండా ఏది సాధ్యమో... ఏది అసాధ్యమో బేరీజు వేసుకుని మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నిజాయితీ గతంలో ఆయనకు అనుకూలించకపోయినా ఈ సారి మాత్రం ఓటర్లలో తప్పక మార్పు వస్తుందని అంటున్నారు. రాజకీయాల్లో నానాటికీ నీతి - విశ్వసనీయత కొరవడుతున్న ఈ రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాహసమేనని అంటున్నారు. అయినా ఈసారి ప్రజలు జగన్ మోహన్ రెడ్డి వెనుకే ఉంటారని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా లోలోపల చర్చించుకుంటున్నారు.