Begin typing your search above and press return to search.

బాబూ... ఈ తల్లి మాటలు విను

By:  Tupaki Desk   |   11 Nov 2018 6:00 AM GMT
బాబూ... ఈ తల్లి మాటలు విను
X
ఓ తల్లి ఆవేదన. ఓ తల్లి ఆందోళన. ఓ తల్లి సంయమనం. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గురించే. మాజీ ముఖ్యమంత్రి భార్యగా - ప్రతిపక్ష నేత తల్లిగా ద్విముఖ పాత్రను పోషించిన - పోషిస్తున్న విజయమ్మ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఒక తల్లిగా తన కుమారుడిపై జరిగిన హత్యాయత్నంపై విజమయ్మ ప్రతిస్పందన టీవీల్లో చూసిన వారందరికి కంటతడి పెట్టించింది. కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీలు తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విజయమ్మ తన కుమారుడి వెనుక ప్రజలు ఉన్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు లేవన్న విజయమ్మ తన కుమారుడి పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న చర్యలపై కన్నీళ్లతోనే ప్రశ్నల వర్షం కురిపించారు. 16 నెలల పాటు జైలులోను - మూడున్నరేళ్లుగా ప్రజల్లోనూ ఉన్న తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తనకు - తన భార్య పిల్లలకు కూడా దూరంగా ప్రజల మధ్యనే ఉంటున్నాడని చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక ఓ తల్లి ఆవేదన దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే భర్తను పోగొట్టుకున్న తాను మరో కష్టానికి మానసికంగా - శారీరికంగా సిద్ధంగా లేనని కన్నీళ్ల మధ్య వెల్లడించారు.

జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొవాలే తప్ప ఆయన కుటుంబ సభ్యులను కూడా వెంటాడడం ఎలాంటి రాజకీయమని విజయమ్మ ప్రశ్నించారు. "జగన్ భార్యను వదలడం లేదు. తల్లినైన నన్ను వదలడం లేదు. తన చెల్లెలు షర్మిలను వదలడం లేదు. ఇలా కుటుంబ సభ్యులందరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు " అని విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతోంది. " ఓ తల్లిగా విజయమ్మ ఆవేదన అందరికి కన్నీళ్లు తెప్పించింది. రెండు చేతులతో నమస్కరిస్తూ నా కడుపు కొట్టకండి అంటూ కన్నీళ్లతో వేడుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేసింది" అని ఓ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలే కంటికి రెప్పలా కాపాడుకుంటారని - ఇందుకు నిదర్శనమే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అని విజయమ్మ ప్రజలకు తమ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. ప్రజలే తన కుటుంబసభ్యులుగా మార్చుకున్న జగన్ మోహన్ రెడ్డిపై ముందుముందు ఎలాంటి హత్యాయత్నాలు చేయవద్దంటూ వేడుకున్న తీరు అందరినీ కలచివేసింది.