Begin typing your search above and press return to search.

అస‌భ్య పోస్టులు..ఏపీలో అరెస్టులు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   4 March 2019 6:18 AM GMT
అస‌భ్య పోస్టులు..ఏపీలో అరెస్టులు మామూలుగా లేవుగా?
X
మీడియాను త‌ల‌ద‌న్నేలా సోష‌ల్ మీడియా అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో పోస్టుల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ఉండేది కాదు. కానీ మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. చేతిలో ఉన్న సెల్లు ఫోన్ కు అనుక్ష‌ణం స‌మాచారం వెల్లువ‌లా వ‌చ్చేయ‌టం.. కొత్త కొత్త అంశాలు తెర మీద‌కు వ‌స్తున్న ప‌రిస్థితి. గ‌తంలో సామాన్యులు ఎవ‌రైనా తాము ఏదైనా చెప్పాల‌నుకుంటే వేదిక‌లు ఉండేవి కావు. ఆ లోటును తీరుస్తూ సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇవ్వ‌టంతో.. ఎవ‌రికి వారు వారేం చెప్పాల‌నుకుంటున్న విష‌యాన్ని ఎవ‌రికి న‌చ్చిన‌ట్లుగా వారు చెప్పేస్తున్నారు.

ఎన్నిక‌ల వేడి ఏపీలో అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా.. అందుకు త‌గ్గ‌ట్లే వివిధ రాజ‌కీయ పార్టీల అభిమానులు..కార్య‌క‌ర్త‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్న వైనం పెరుగుతోంది. అన్ని చోట్ల ఇలాంటి ప‌రిస్థితే ఉంది. అయితే..ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఈ తీరు మోతాదు మించేలా ఉంద‌న్్న మాట వినిపిస్తోంది.

తాజాగా టీడీపీ మ‌హిళా నేత సాదినేని యామినిపై అస‌భ్య పోస్టింగ్స్ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న‌ట్లుగా పోలీసుల‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ కంప్లైంట్స్ లో స్పందిస్తున్న పోలీసులు జ‌న‌సేన‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా సాదినేని యామినిపై అస‌భ్య పోస్టులు పెట్టారంటూ న‌వంబ‌రు 23న గుంటూరు ప‌ట్ట‌ణంలోని అరండ‌ల్ పేట స్టేష‌న్లో కేసు న‌మోదైంది.

ఈ కేసులో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని నెల్లూరు జిల్లాకు చెందిన ఐటీ ఇంజ‌నీర్ శ్రావ‌ణ్ కుమార్ ను అరండ‌ల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో తాజాగా జ‌న‌సేన‌కు చెందిన మంగ‌ళ‌గిరి మండ‌లానికి చెందిన ఒక‌రిని.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లానికి చెందిన మ‌రొక‌రిని .. భీమ‌డోలుకు చెందిన ఇంకొక‌రిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌రలించ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా అస‌భ్య పోస్టింగ్ లు పెడుతున్నట్లు అందుతున్న ఫిర్యాదుల‌పైనా చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ త‌ర‌హా ఫిర్యాదుల‌పైన స్పందిస్తున్న పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. రాజకీయంగా బేధాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ.. వాటిపై త‌మ అభిప్రాయాల్ని మోతాదు మించ‌ని రీతిలో చెప్పాలే కానీ అస‌భ్య ప‌ద‌జాలాలు.. వ్య‌క్తిహ‌న‌నానికి పాల్ప‌డేలా ఉండ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. అయితే.. ఏపీలో అధికార పార్టీకి మ‌ద్ద‌తుగా పెట్టే పోస్టింగులు ఎలా ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఏమైనా కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌లో.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టుల మీద వ‌స్తున్న ఫిర్యాదుల‌పై జ‌రుగుతున్న అరెస్ట్ లపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.