Begin typing your search above and press return to search.

రోజా క్ష‌మాప‌ణ చెప్పాలంటున్న పోలీసులు

By:  Tupaki Desk   |   23 Feb 2017 10:25 AM GMT
రోజా క్ష‌మాప‌ణ చెప్పాలంటున్న పోలీసులు
X
సినీ న‌టి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసే విధంగా ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు మంత్రి పీత‌ల సుజాత‌ - ఎమ్మెల్యే వనిత‌ - అధికార ప్ర‌తినిధి ముళ్ల‌పూడి రేణుక వంటి మ‌హిళా నేత‌ల‌తో పాటు బోండా ఉమా వంటి సీనియ‌ర్లతో సైతం రోజాపై పార్టీ ప‌రంగా ఎదురుదాడి చేయించిన తెలుగుదేశం పార్టీ ఇపుడు ప్ర‌భుత్వ ప‌రంగా కూడా ఆమెను చిక్కుల్లో ప‌డేసేందుకు ప్లాన్ వేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. రోజా త‌మ‌ను విమ‌ర్శించినందున బహిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆంధ్ర‌ప్రదేశ్ పోలీస్ అసోసియేష‌న్ డిమాండ్ చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.

తాజాగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఏపీ పోలీస్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు మీడియాతో మాట్లాడుతూ మ‌హిళా పార్ల‌మెంటు స‌మావేశాల జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై రోజా వ్యాఖ్య‌లు త‌మ‌ను తీవ్రంగా క‌ల‌చివేశాయ‌ని, త‌మ‌ మ‌నోభావాలు దెబ్బ‌తీశాయ‌ని పేర్కొన్నారు. అందుకే త‌మ‌కు రోజా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాము ఎవ‌రి ప‌క్ష‌మో కాద‌ని, చ‌ట్టం ప‌రిధిలో నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌మ విధులు నిర్వ‌ర్తించామ‌ని తెలిపారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే సంద‌ర్భం ఎదురైతే అలాంటి సంద‌ర్భాన్ని చ‌క్క‌దిద్దాల్సిన బాధ్య‌త ఉన్నందునే తాము జోక్యం చేసుకున్న‌ట్లు వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో క‌ల‌త చెంది ఈ డిమాండ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాగా, మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆహ్వానించి మ‌రీ విమానం దిగీ దిగ‌క‌ముందే అన్న‌ట్లుగా గన్నవరం ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకుని అరెస్టు చేసిన వైనం క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. మహిళా సదస్సు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే మహిళా ఎమ్మెల్యేను సదస్సు వరకూ రానీయకుండా అడ్డుకున్నారన్న విమ‌ర్శ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వంపై వినిపించాయి. వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఆహ్వానించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వం రోజా విష‌యంలో మాత్రం ఆ విధ‌మైన సంప్ర‌దాయం పాటించ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/