Begin typing your search above and press return to search.

టార్గెట్ బాబు.. టెన్షన్ టెన్షన్ గా ఏపీ పోలీసులు

By:  Tupaki Desk   |   25 April 2017 6:58 AM GMT
టార్గెట్ బాబు.. టెన్షన్ టెన్షన్ గా ఏపీ పోలీసులు
X
ఛత్తీస్ గఢ్ రాష్ర్టం సుకుమా జిల్లాలో నిన్న మావోయిస్టులు జరిపిన భారీ దాడిలో పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. గత మూణ్నాలుగేళ్లుగా వరుసగా అగ్రనేతలను కోల్పోయి.... వేలాదిమంది క్యాడర్ లొంగిపోయి.... ఆర్నెళ్ల కిందట మల్కనగిరిలో 24 మంది కామ్రేడ్లను కోల్పోయి... అగ్రనేత ఆర్కే తృటిలో ప్రాణాలతో బయటపడడడం ఊపిరిపీల్చుకున్న మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉందని... ఆ పార్టీ పనైపోయిందని పోలీసులు తరచూ చెబుతున్నారు. కానీ... వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్నెళ్ల కిందట మల్కనగిరిలో దారుణంగా దెబ్బతిన్న తరువాత మావోయిస్టు పార్టీ రగిలిపోతుందని... ఎలాగైనా భారీ టార్గెట్ కొట్టి మళ్లీ లేవాలని ట్రై చేస్తోందని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలూ అదే నిజమని చెబుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యం చేసుకుని మావోయిస్టులు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారని... ఆ సంగతి తెలుసుకున్న ఏపీ పోలీసులు అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది.

మల్కనగిరి ఎన్ కౌంటర్లో అగ్రనేత ఆర్కే కొద్దిలో తప్పించుకున్నారు. ఆ ఎన్ కౌంటర్లో ఆర్కే కుమారుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆర్కే ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారని భావిస్తున్నారు. అంత భారీ ఎన్ కౌంటర్ లో తప్పించుకున్న ఆర్కే ఆచూకీ అప్పట్లో బయట ఉన్న మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు, నేతలకూ తెలియకపోవడంతో ఆయన్ను పోలీసులు పట్టుకున్నారని భావించారు. వాస్తవాలు ఏవైనా మొత్తానికైతే ఆర్కే ప్రాణాలతో బయటపడి మళ్లీ పార్టీకి కాంటాక్టులోకి వచ్చారు. సాధారణంగా అలాంటి ఘటన తరువాత అగ్రనేతలు సేఫ్ షెల్టర్ జోన్లకు వెళ్తారు. కానీ... ఆర్కే అక్కడికి నెల రోజుల్లో రెండు సార్లు మళ్లీ పోలీసులకు చిక్కుకుండా తప్పింకున్నారు. అంటే ఆయన అక్కడే తిష్ఠవేసి భారీ ప్లాన్లు గీస్తున్నారని అర్థమవుతోంది.

మరోవైపు చంద్రబాబుపై ఢిల్లీలో, అమరావతిలో మావోయిస్టులు రెక్కీ చేశారు. ఈ సంగతి ఢిల్లీలోని నిఘావర్గాలు, ఏపీ నిఘా వర్గాలు కూడా గుర్తించాయి. దాంతో చంద్రబాబు భద్రతను భారీగా పెంచారు. రీసెంటుగా చంద్రబాబు హైదరాబాద్ లో కట్టుకున్న ఇంటి గృహ ప్రవేశం సమయంలోనూ మరోసారి రెక్కీ చేశారని తెలుస్తోంది. స్వయంగా ఏపీ డీజీపీ కూడా చంద్రబాబు తీవ్ర ముప్పులో ఉన్నారని ప్రకటించారు. అమరావతిలో చంద్రబాబు వచ్చీపోయే మార్గాలనూ తరచూ మారుస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారి చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడం... ఆయన భద్రతను మరే ముఖ్యమంత్రికీ లేని స్థాయిలో కనివినీ ఎరుగని రీతిలో పెంచుకుంటూ పోవడం చూస్తుంటే చంద్రబాబు, పోలీసులు బాగా టెన్షన్ పడుతున్నట్లు అర్థమవుతోంది. పరిస్థితులు అంత క్లిష్టంగా ఉంటే తప్ప టెన్షన్ ఈ స్థాయిలో ఉండదు.

చంద్రబాబే లక్ష్యంగా ఆర్కే ఇప్పటికే యాక్షన్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి ఛత్తీస్ గఢ్ దాడి కూడా ఆర్కే ప్లానింగ్ లో భాగమేనని.... భారీ అటాక్ తో దళాల్లో ఆత్మవిశ్వాసం పెంచడం.. ఆయుధాలు సమీకరించుకోవడం కోసం ఇది చేశారని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/