Begin typing your search above and press return to search.

ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..

By:  Tupaki Desk   |   10 July 2017 7:43 AM GMT
ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..
X
అశోకుడు - అక్బర్ - షేర్షా - చంద్రగుప్తుడు - అల్లాఉద్దీన్ ఖిల్జీ - ఔరంగేజేబు - గజనీ - ఘోరీ - తుగ్లక్... ఒక్కో చక్రవర్తిది ఒక్కో చరిత్ర.. రామరాజ్యాన్ని తలపించినవారు కొందరు - రక్త పారించినవారు మరికొందరు... స్వర్ణయుగాలు - ఉన్మాదాలు - ఉన్మత్త దాడులు - ప్రతి దానికీ పన్నేసినవారు కొందరు - ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్నది కొందరు... ఇలా చరిత్రలో ఎన్నో పుటలు. ప్రాచీన గ్రంథాలు - పురావస్తు అవశేషాలు - శాసనాల ఆధారంగా వేసుకున్న అంచనాల నుంచి రాసుకున్న చరిత్ర పుస్తకాలు ఎవరి గురించి ఎలా చెబితే అలా నమ్ముతున్నాం. కానీ... ఆధునిక భారత చరిత్ర మాత్రం చాలావరకు స్పష్టంగానే ఉంది. బ్రిటిషర్ల పాలన - స్వాతంత్ర్య పోరాటాలు - ఆ తరువాత కాంగ్రెస్ - ఇతర పార్టీల పాలనలు అన్నీ అక్షరబద్ధమైంది కొంత - జ్ఞాపకాల నుంచి జాలువారి తరువాత తరాలకు ప్రవహించి కొంత చరిత్ర ఇప్పటికీ వర్తమానంలో నానుతూనే ఉంది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వర్తమానం విషయానికొస్తే తరువాత తరాలు ఇదంతా చరిత్రగానే చదువుకోవాలి. అందుకు చరిత్రకారులు - అనుభవశీలురు.. అన్నీ చూసినవారు చెప్పిన, రాసిన చరిత్ర అవసరం లేకుండా రాజకీయ పార్టీలే కొత్త చరిత్రను రాస్తున్నాయి. ఒకరిపై ఒకరు చల్లుకునే బురదను అక్షరబద్ధం చేసే పత్రికల క్లిప్లింగుల నుంచి ఏరుకునే అవకాశం లేకుండా అన్నీ ఒక్కచోట గుదిగూర్చి ఒకరి అవినీతి చరిత్రను మరొకరు పుస్తకాలుగా అచ్చేసి పంచి పెడుతున్నారు. హార్డ్ కాపీకి తోడు సాఫ్ట్ కాపీలు కూడా ఉంటే బెటరని పీడీఎఫ్ లు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తానికి ఏపీలోని ఈ రాజకీయ చండాలాన్ని భవిష్యత్తు తరాలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ గట్టిగానే కృషి చేస్తున్నాయి.

రాజా ఆఫ్ కరప్షన్ అని చంద్రబాబు పార్టీ మొదలుపెడితే ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని జగన్ పార్టీ దాన్ని కొనసాగించింది. అంతేకాదు.. రాష్ర్టానికే మోసగాడు అంటూ మరో పుస్తకం వేసింది. తాజాగా చంద్రబాబు 3.75 లక్షల కోట్లు అవినీతి గురించి కూడా పుస్తకమేసింది. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. రాజా ఆఫ్ కరప్షన్ అని జగన్ అవినీతిపై పుస్తకం తెస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు... నీటిపారుదల మంత్రి దేవినేని అయితే తానే స్వయంగా జగన్ అవినీతిపై పుస్తకం రాస్తున్నానని ప్రకటించారు.

మొత్తానికి అంతా ఒకరి అక్రమాలు ఒకరు వెలికి తీస్తూ జనానికి మాత్రం నిజాలు చెబుుతున్నారు. మన నేతల చరిత్ర ఇదీ అని భవిష్యత్ తరాలు తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు.