Begin typing your search above and press return to search.

బాబు.. ఇప్పుడే మేల్కొన్నారా?

By:  Tupaki Desk   |   15 July 2021 7:30 AM GMT
బాబు.. ఇప్పుడే మేల్కొన్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు చాలా ఆల‌స్యంగా మేల్కొన్న‌ట్లు క‌నిపిస్తున్నారు. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌జా ప్ర‌తినిధులు తీవ్ర‌స్థాయిలో ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.

రెండు ప్ర‌భుత్వాలు ఈ వివాదంపై కేంద్రానికి లేఖ రాశాయి. ఇన్ని జ‌రుగుతున్నా ఇంత కాలం ఏమీ ప‌ట్ట‌నట్లు వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు తాజాగా జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ జ‌ల వివాదంపై తొలిసారి బ‌హిరంగంగా మాట్లాడారు.

ఏపీ అక్ర‌మంగా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌తో పాటు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు చేప‌డుతుందంటూ తెలంగాణ‌, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుందంటూ ఏపీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్ క‌లిసి ప‌నిచేశార‌ని, కానీ ఇప్పుడు మాత్రం జ‌ల వివాదాల‌పై కూర్చుని మాట్లాడుకోలేరా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

కేసీఆర్‌తో మాట్లాడే ధైర్యం జ‌గ‌న్‌కు లేదా? అని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌భుత్వం నీటిని పులిచింత‌ల‌లో వ‌దిలి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంటే జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. నీటిని వృథాగా స‌ముద్రం పాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

గ‌తంలో తాను సీఎంగా ఉన్న‌పుడు ఇలాంటి నీటి స‌మ‌స్య వ‌స్తే వెంట‌నే కేసీఆర్‌తో మాట్లాడి ప‌రిష్క‌రించామ‌ని గుర్తు చేశారు. రాష్ట్ర హ‌క్కుల‌ను కాపాడుకుంటూనే ప్ర‌తి ఎక‌రాకు నీళ్లివ్వ‌చ్చ‌ని చెప్పిన బాబు న‌దులు అనుసంధానం ద్వారా ఏపీలో నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

అయితే ఇన్ని రోజుల పాటు జ‌ల వివాదంపై స్పందించ‌ని బాబు ఇప్పుడు ఒక్క‌సారిగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డంలో ఆంత‌ర్య‌మేంటో అర్థం కావ‌ట్లేదు. అటు తెలంగాణలో టీడీపీ ప‌రిస్థ‌తి అంతంత‌మాత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ త‌న‌కేదో అవ‌స‌రం ఉన్న‌ట్లు.. జ‌ల వివాదంలో తెలంగాణ ప్ర‌భుత్వ వైఖ‌రిని విమ‌ర్శిస్తే అక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌న‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని బాబు భ‌య‌ప‌డుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కానీ తెలంగాణ‌లో టీడీపీ వాస్త‌వ ప‌రిస్థ‌తి బాబుకు అర్థ‌మ‌వుతున్న‌ట్లు లేదు. ఇక అక్క‌డ పార్టీకి భ‌విష్య‌త్ లేనే లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు నీటి స‌మ‌స్య‌పై జ‌గ‌న్ తీరును ఎండ‌గ‌ట్టి ఇక్క‌డ ప్ర‌యోజ‌నం పొందాల‌నే ఉద్దేశంతో బాబు ఉన్నాడ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.