Begin typing your search above and press return to search.

జైట్లీ గారూ.. తెలుగు నేల కోర్కెలు తీరుస్తారా?

By:  Tupaki Desk   |   27 Jan 2018 11:03 AM GMT
జైట్లీ గారూ.. తెలుగు నేల కోర్కెలు తీరుస్తారా?
X
పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి (2018-19) సంబంధించిన కేంద్ర బ‌డ్జెట్ క‌స‌ర‌త్తులు ఇప్ప‌టికే దాదాపుగా పూర్తి అయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత అరుణ్ జైట్లీ స‌ద‌రు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని పార్లెమెంటు సాక్షిగా చ‌దివి వినిపించ‌డ‌మే త‌రువాయి. మ‌రి బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో త‌న‌కు అందిన డిమాండ్ల‌ను జైట్లీ ఏ మేర‌కు ప‌రిష్క‌రించార‌న్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి. కేంద్ర బ‌డ్జెట్ వ‌స్తోందంటే... దేశంలోని అన్ని రంగాల నుంచి కేంద్రానికి... ప్ర‌త్యేకించి కేంద్ర ఆర్థిక శాఖ‌కు ఆయా రంగాల నుంచి విన‌తులు వెల్లువెత్త‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్ప‌టికే బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న పూర్తి అయిన నేప‌థ్యంలో మ‌రి ఆయా రంగాలు త‌న ముందు ఉంచిన ఎన్ని డిమాండ్ల‌కు జైట్లీ న్యాయం చేశార‌నే అంశ‌మే కీల‌కంగా మారింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టిదాకా మూడు బ‌డ్జెట్లు వ‌చ్చినా.. తెలుగు నేల‌కు పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ థ‌నిక రాష్రంగా అవ‌త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ‌కు పెద్ద‌గా డిమాండ్లేమీ లేకున్నా... కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం తెలంగాణ స‌ర్కారు కేంద్రం ముందు త‌న ప్ర‌తిపాద‌న‌లు ఉంచుతూనే వ‌స్తోంది. వీటికి కేంద్రం నుంచి కొన్ని సార్లు సానుకూల సంకేతాలు వినిపిస్తున్నా... మ‌రికొన్ని సంద‌ర్భాల్లో తిర‌స్కార‌మే స‌మాధాన‌మ‌వుతోంది. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీకి మాత్రం కేంద్రం ప్ర‌తిసారీ అన్యాయ‌మే చేసింద‌న్న వాద‌న లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా బ‌డ్జెట్‌కు సంబంధించి కేంద్రంపై ఏపీ స‌ర్కారు పెద్ద ఆశ‌లే పెట్టుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఒ పెద్ద లిస్టే కేంద్రానికి వెళ్లింద‌న్న విష‌యంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ జాబితాలో ఏమేం ఉన్నాయ‌న్న విష‌యంపై ఇప్ప‌టిదాకా పెద్ద‌గా స్ప‌ష్ట‌త లేకున్నా... చంద్ర‌బాబు స‌ర్కారు నుంచి నిత్యం వినిపిస్తున్న డిమాండ్లే కేంద్రానికి వెళ్లి ఉంటాయ‌న్న వాద‌న‌లో ఏమాత్రం సందేహం లేద‌నే చెప్పాలి. ఆ జాబితాలో ఏమేం ఉంటాయ‌న్న విష‌యానికి వ‌స్తే...

* విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి ప్ర‌క‌టించాల్సిన ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్యాకేజీపై కేంద్రం ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త ఇచ్చిన దాఖ‌లా లేదు. ఈ బ‌డ్జెట్‌లోనైనా ఏపీకి అందించే ప్యాకేజీపై స్పష్ట‌త ఇవ్వ‌డంతో పాటుగా ఏఏ శాఖ‌ల‌కు ఎంత‌మేర నిధులిస్తున్నారో కేంద్రం చెబుతుంద‌ని బాబు స‌ర్కారు ఆశ‌గా ఉంది.

* విభ‌జ‌న చ‌ట్టం ఆదేశాల మేర‌కు ఏపీకి చాలా కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్ర‌క‌టించారు. అయితే ఆయా సంస్థ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిధుల విష‌యంలో కేంద్రం ఇప్ప‌టిదాకా పెద్ద‌గా స్పందించిందే లేదు. ఈ బ‌డ్జెట్‌లో ఆయా సంస్థ‌ల‌కు పూర్తి స్థాయి నిధులు ఇవ్వాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది.

* పోలవ‌రం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నిధుల‌ను ఈ బ‌డ్జెట్‌లో కేంద్రం విడుద‌ల చేస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

* ఆర్థిక లోటు భ‌ర్తీ విష‌యంలో ఇప్ప‌టిదాకా కేంద్రం చాలా త‌క్కువ నిధుల‌నే విదిల్చింది. ఈ బ‌డ్జెట్‌లో మిగిలిన నిధులు విడుద‌ల‌వుతాయ‌న్న గంపెడాశ‌తో బాబు స‌ర్కారు ఎదురు చూస్తోంది.

* మొన్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఏపీ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. స‌ద‌రు భేటీలో ఏపీలో పెండింగ్‌లో ఉన్న చాలా ప్రాజెక్టుల‌ను ఎంపీలు ప్ర‌స్తావించారు. అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టుల‌కు సంబంధించి బాబు స‌ర్కారు నుంచి కూడా ఓ లేఖ వెళ్లింది. ఈ జాబితాలోని ప్రాజెక్టుల‌కు అనుమ‌తి వ‌స్తుందా? రాదా? అన్న‌ది జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం తేల్చాల్సి ఉంది.

* ఉపాధి హామీ ప‌థ‌కం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం పెద్ద కోతే పెట్టింద‌న్న వాద‌న ఉంది. ఈ బ‌డ్జెట్‌లో పెండింగ్ నిధుల‌తో పాటు మ‌రింత మేర ఎక్కువ నిధుల‌ను ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి విడుద‌ల చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరుతోంది.

* విజ‌య‌వాడ‌ - విశాఖ‌ల్లో ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన మెట్రో రైలు ప్రాజెక్టుల‌కు సంబంధించి గ‌త బ‌డ్జెట్లో అర‌కొర నిధులే విడుద‌ల‌య్యాయి. ఈ సారి బ‌డ్జెట్‌లోనైనా ఈ రెండు ప్రాజెక్టుల‌కు సంబంధించిన పూర్తి స్థాయి నిధులు విడుద‌ల చేయాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది.

* ఇక అత్యంత ప్రాధాన్యం క‌లిగిన అంశంగా రాజ‌ధాని నిర్మాణం నిలుస్తోంది. ఇప్ప‌టికే రాజ‌ధాని నిర్మాణం కోసం కేంద్రం ఏపీ స‌ర్కారుకు రూ.1,500 కోట్లు విడుద‌ల చేసింద‌ని ఓసారి, రూ.2,500 కోట్లు విడుద‌ల చేసింద‌ని మ‌రోసారి వార్త‌లు వ‌చ్చాయి. అయితే విడుద‌ల చేసిన నిధుల‌ను ప‌క్క‌న‌బెడితే... రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన పూర్తి స్థాయి నిధుల‌ను కేంద్రం విడుద‌ల చేయాల‌ని ఏపీ స‌ర్కారు కోరుతోంది.