Begin typing your search above and press return to search.

అప్పుల‌ కోసం ఆ దారిలో!?

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:30 AM GMT
అప్పుల‌ కోసం ఆ దారిలో!?
X
ఇప్ప‌టికే అప్పుల కుప్ప‌లో మునిగిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మాత్రం మార్చుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొత్త‌గా అప్పు పుట్టించే మార్గాల కోసం స‌ర్కారు తీవ్రంగా వెతుకుంద‌ని.. అవ‌కాశం ఉన్న ప్ర‌తి అంశాన్ని ఉప‌యోగించుకుని అప్పు రాబ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని రాష్ట్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నాయి. తాజాగా ఆ ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రో నిర్ణ‌యం కూడా అప్పు తీసుకోవ‌డం కోస‌మేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్ర రోడ్డు భ‌వ‌నాల శాఖ వ‌ద్ద ఉన్న ఆస్తుల్లో 3,786 కోట్ల రూపాయాల విలువైన భూములు భ‌వ‌నాల‌ను ఏపీఆర్‌డీసీకి బ‌ద‌లాయిస్తూ స‌ర్కారు జీవో 46ను జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాష్ట్రంలో ర‌హ‌దారుల‌ను అందంగా తీర్చిదిద్దుదామ‌ని రెండు వేల కోట్ల రూపాయ‌ల రుణాన్ని తీసుకుర‌మ్మ‌ని ఏపీఆర్‌డీసీకి చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఆర్ అండ్ బీ ఆస్తుల‌ను ఆర్‌డీసీకి బ‌ద‌లాయించి వాటిని తాక‌ట్టు పెట్టి భారీ అప్పు తెచ్చేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే రూ.ఆరు వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన ఆర్‌డీసీని ఆదుకోవ‌డానికి ఈ ఆస్తులు ఇవ్వ‌డం లేదు. రోడ్ల నిర్వ‌హ‌ణ అభివృద్ధి స్థ‌లాల అభివృద్ధి మ‌రమ్మ‌తులు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకునేందుకు ఈ ఆర్ అండ్ బీ ఆస్తుల‌ను ఆర్‌డీసీకి అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కానీ ఇప్ప‌టికే ఆర్‌డీసీ తీసుకున్న రుణంతో ర‌హ‌దారులు మ‌ర‌మ్మ‌తు చేసిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అది తెలిసి కూడా ఇప్పుడు రోడ్ల నిర్వ‌హ‌ణ‌కు ఆదాయ వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవాల‌ని ఆర్‌డీసీకి ఈ ఆర్ అండ్ బి ఆస్తులు క‌ట్ట‌బెడుతున్నామ‌ని చెప్ప‌డం అప్పుల కోసం ఆడుతున్న నాట‌క‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆర్ అండ్ బీకి రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్ల విలువైన భూములు ఆస్తులు భ‌వ‌నాలున్నాయి. వీటిలో మొద‌ట రూ.4,500 కోట్ల విలువైన భూములు భ‌వనాల‌ను ఏపీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ద్వారా బ్యాంకులకు తాక‌ట్టు పెట్టి రుణం తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ దీని వ‌ల్ల సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్పిన అధికారులు రోడ్లు భ‌వ‌నాల శాఖ ప‌రిధిలో ఏపీ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఆర్‌డీసీ) ఉంద‌ని ఆర్ అండ్ బీ భూముల‌ను ఆ సంస్థ‌కు ఇచ్చి దాని ద్వారా రుణం తీసుకునే ప్ర‌యత్నాలు చేయాల‌ని సూచించారు. అందుకు స‌రేన‌న్న ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు రూ.3,393 కోట్ల విలువైన 574.37 ఏక‌రాలతో పాటు 3,31,167 చ‌ద‌ర‌పు గ‌జాల్లో ఉన్న ఆర్ అండ్ బీ భ‌వ‌నాలు గెస్ట్‌హౌజ్‌లు ఆర్‌డీసీకి అప్ప‌గిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీటి మొత్తం విలువ రూ.3,786 కోట్లు. ఏపీఆర్‌డీసీ ర‌హ‌దారుల నిర్మాణం నిర్వ‌హ‌ణ మాత్ర‌మే చూస్తుంది కానీ వాటితో ఎలాంటి వ్యాపారాలు చేయ‌దు. అలాంటిది ఆర్‌డీసీ త‌న‌కు తానుగా అద‌న‌పు ఆదాయం వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకునేందుకు ఆర్ అండ్ బీ ఆస్తుల‌ను ఇస్తున్న‌ట్లు స‌ర్కారు ఇప్పుడు పేర్కొంది.

స‌ర్కారు ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఆ ఆస్తులు భూముల‌తో వ్యాపారం చేసుకోమ్మ‌ని అర్థం. కానీ వాటిని అమ్మ‌లేరు. ఇత‌రుల‌కు లీజుకిచ్చి వ్యాపారం చేయ‌లేరు. ఇక మిగిలిన ఏకైక ప్ర‌త్యామ్నాయం బ్యాంకుల‌కు తాక‌ట్టు పెట్టి అప్పు తీసుకోవ‌డ‌మే. స‌ర్కారుకు కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు ఈ అప్పును ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడుకునే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలోనూ ఇలాగే తీసుకొచ్చిన రూ.3 వేల కోట్ల రుణాన్ని ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ళ్లించారు. ఇప్ప‌టికే ఏపీఆర్‌డీసీ ఆరువేల కోట్ల రూపాయ‌ల అప్పుల్లో ఉంది.