Begin typing your search above and press return to search.

బాబు తాజా స్కీం.. నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:05 AM GMT
బాబు తాజా స్కీం.. నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌
X
ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అంశాల‌కు సంబంధించిన నిర్ణ‌యాల్ని ఎంత వేగంగా తీసుకుంటే అంత మంచిది. కానీ.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు అంతులేని జాప్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. ఎందుకిలా చేస్తాయ‌న్న దానిపై ఎవ‌రూ సూటిగా స‌మాధానం చెప్ప‌రు. ఇప్ప‌టికేప‌లు రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న నో హెల్మెట్.. నోపెట్రోల్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్నారు.

కొన్ని సంవ‌త్స‌రాల నుంచే ఈ విధానాన్ని ప‌లుచోట్ల అమ‌లు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకొని బండిని న‌డిపితే.. అనుకోని విధంగా ప్ర‌మాదం జ‌రిగినా ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. కానీ.. ఇలాంటి అత్య‌వ‌స‌ర నిర్ణ‌యాల్ని అమ‌లు చేయ‌టానికి సైతం ఏళ్ల‌కు ఏళ్లు ప‌ట్టే దుస్థితి మ‌న వ్య‌వ‌స్థ‌లోనే క‌నిపిస్తుంది.

ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులంతా త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని.. ప్ర‌జ‌ల చేత హెల్మెట్లు పెట్టుకునేలా చేసేందుకు పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం.. నిబంధ‌న‌ల్ని క‌ఠినంగా అమ‌లు చేస్తే ప్ర‌జ‌ల్లో మార్పు రావ‌టం ఖాయం.
కానీ.. ఆ ప‌ని చేసే విష‌యంలో ప్ర‌భుత్వాలు అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. అందుకు ఏపీ స‌ర్కారు మిన‌హాయింపు ఎంత‌మాత్రం కాదు. తాజాగా హెల్మెట్ లేని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకునేందుకు బాబు కిందా మీదా ప‌డుతున్నారు. తాజాగా జ‌రిపిన స‌మీక్ష‌లో ఈ విధానాన్ని అమ‌లు చేయ‌టానికి త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల్సిందిగా ఆయ‌న కోరుతున్నారు.

అధికారులు స్పందించి.. కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసి.. విధివిదానాలు ఖ‌రారు చేసి అమ‌లు చేసే స‌మ‌యానికి ఇంకెంత కాలం ప‌డుతుందో అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ప్ర‌జల ప్రాణాల్ని కాపాడే నిర్ణ‌యాల్ని యుద్ధప్రాతిప‌దిక‌న తీసుకొని క‌చ్ఛితంగా అమ‌లయ్యేలా చేయాల్సిన బాధ్య‌త పాల‌కుల మీద ఉంటుంది. ఈ విష‌యాన్ని బాబు ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అన్ని ప్రాణాల్ని కాపాడినవాళ్లు అవుతారు. కార్యాచ‌ర‌ణ వ‌ర‌కూ వ‌చ్చిన నో హెల్మెట్‌.. నో పెట్రోల్ స్కీం అమ‌లు కావ‌టానికి మ‌రెన్ని నెల‌లు ప‌డుతుంది చంద్ర‌బాబు?